
అటవీప్రాంతంలో మల్లేశం మృతదేహం
మెదక్ రూరల్: ఓ వ్యక్తి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మెదక్ మండలం చిట్యాల గ్రామశివారులోని అటవీ ప్రాంతంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్‌రూరల్ పోలీసుల కథనం ప్రకారం...మండలంలోని మంభోజిపల్లి గ్రామానికి చెందిన బండ్ల మల్లేశం(48) ఈనెల 2న కుటుంబీకులతో కలిసి పొలం పనులకు వెళ్లాడు.
ఈ క్రమంలో అతడికి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్లాడు. అదేరోజు రాత్రి 8గంటల ప్రాంతంలో ఫోన్ చేయగా వస్తున్నానని బదులిచ్చినట్లు మృతుడి భార్య వెంకమ్మ తెలిపింది. కాగా ఇంటికి తిరిగి రాకపోవడం, రాత్రి సమయంలో ఫోన్ స్విచ్చాఫ్ కావడంతో బంధువుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఈనెల 4న మృతుడి భార్య మెదక్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉంటే శనివారం చిట్యాల శివారులోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని శవం కనిపించిందని జానకంపల్లి గిరిజనులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మల్లేశం కుటుంబీకులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కుటుంబీకులు మృతదేహం మల్లేశందేనని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. మృతుడికి భార్య వెంకమ్మ, ఒక కొడుకు ఉన్నారు.