దయలేని దేవుడు
- పది రోజుల కిందట భార్య మృతి
- డెత్ సర్టిఫికెట్ కోసం వస్తూ రోడ్డు ప్రమాదంలో భర్త దుర్మరణం
- మరో ప్రమాదంలో రిటైర్డ్ వైద్యురాలు..
దయలేని దేవుడు.. చిన్నచూపు చూశాడు. వృద్ధాప్యంలో తోడు లేకుండా చేశాడు. పది రోజుల కిందట భార్య చనిపోగా.. ఆ వియోగం నుంచి ఇంకా అతను పూర్తిగా కోలుకోలేకపోయాడు. భార్య డెత్ సర్టిఫికెట్ కోసం వస్తున్న అతనిపై మృత్యువు పగబట్టింది. అప్పటి వరకు తాను ప్రయాణించి వచ్చిన బస్సు చక్రాల కిందే పడి అతను మరణించారు. వరుసగా జరిగిన ఘటనతో వారి ఏకైక కుమార్తె కన్నీరుమున్నీరైంది. మరో ప్రమాదంలో రిటైర్డ్ వైద్యురాలు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు సంఘటనలు జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం జరిగాయి.
తాడిపత్రి టౌన్ : తాడిపత్రి ఆర్టీసీ బస్డాండ్ ఆవరణలో బస్సు కింద పడి బందార్లపల్లికి చెందిన నాగప్ప(65) మరణించారు. పట్టణ ఎస్‌ఐ ఆంజనేయులు కథనం మేరకు...నాగప్పకు మగపిల్లలు లేరు. ఉన్న ఒక్కగానొక్క కుమార్తెను కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంటకు పెళ్లి చేసిచ్చారు. నాగప్ప తన భార్యతో కలసి బందార్లపల్లిలోనే ఉండేవారు. అయితే పది రోజుల కిందట భార్య చనిపోగా, అప్పటి నుంచి ఆయన కుమార్తె వద్ద ఉండేవారు. భార్య మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ కోసం తుమ్మలపెంట నుంచి తాడిపత్రికి బుధవారం బయలుదేరి వచ్చారు. బస్సు దిగి దిగుతుండగానే డ్రైవర్ షెక్షావలి నిర్లక్ష్యంతో బస్సును నడపడంతో అతను కిందపడ్డారు. దీంతో తలకు పెద్ద గాయమై రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వెంటనే ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసుకుని తదుపరి కార్యక్రమాలు నిర్వహించారు.
పాత కొత్తచెరువు వద్ద రిటైర్డ్ వైద్యురాలు..
గుంతకల్లు రూరల్ : గుత్తి-గుంతకల్లు రహదారిలోని పాత కొత్తచెరువు వద్ద జరిగిన ప్రమాదంలో రిటైర్డ్ ఈఎన్‌టీ స్పెషలిస్ట్ డాక్టర్ లీలావతి(64) మరణించారు. గుంతకల్లు ప్రభుత్వాస్పత్రిలో ఆమె ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌గా మెరుగైన సేవలందించి, ఈ ప్రాంత ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ఉద్యోగ విరమణ అనంతరం ఐదేళ్లుగా ఆమె గుంతకల్లులోనే స్థిరపడ్డారు. ఈ క్రమంలో ధర్మవరంలోని బంధువులను కలిసేందుకు బుధవారం ఉదయం తన కారు డ్రైవర్ మునిరాజుతో కలసి బయలుదేరారు. మార్గమధ్యంలోని పాతకొత్తచెరువు వద్దకు రాగానే ఎదురుగా విపరీతమైన వేగంతో వచ్చిన బొలేరో వాహనం ఢీకొనడంతో లీలావతి తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా, డ్రైవర్ మునిరాజు స్వల్పంగా గాయపడ్డారు. వారిద్దరినీ 108లో గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే లీలావతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి వద్దనున్న సుమారు రూ.3 లక్షలకు పైగా నగదును ఆమె బంధువులకు 108 సిబ్బంది అప్పజెప్పి తమ నిజాయితీ చాటుకున్నారు.