ప్రేమికులను విడదీసిన మృత్యువు
అప్పటి వరకూ ఊసులాడుకున్నారు.. ఊహలలోకంలో విహరించారు.. బైక్‌పై షికారుకు బయలుదేరారు. అయితే ఆర్టీసీ బస్ రూపంలో మృత్యువు వెంటాడింది. ఆ ప్రేమికుల్లో ఒకరిని అనంతలోకాలకు తీసుకెళ్లింది. ప్రియురాలు విగతజీవిగా పడి ఉండగా ప్రియుడు గుండెలవిసేలా రోదించాడు. చూపరులకు కన్నీళ్లు తెప్పించాడు.
విశాఖపట్నం మద్దెలపాలేనికి చెందిన హరిశివాజి విజయవాడలోని తన బంధువుల ఇంట్లో ఉంటూ ఒక ప్రైవేటు కళాశాలలో ప్రైవేటుగా డిగ్రీతో పాటు సీఏ చదువుతున్నాడు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలోని కురగల్లు గ్రామానికి చెందిన పెద్ది దుర్గారాణి విజయవాడలోని నక్షత్ర హాస్టల్‌లో ఉంటూ సీఏ చదువుతోంది. వీరిద్దరూ కానూరులోని ఓ కళాశాలలో సీఏ చదువుతున్నారు. మూడున్నరేళ్ల క్రితం వీరిమధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. శనివారం మధ్యాహ్నం ఇద్దరూ కలిసి విజయవాడ నుంచి ద్విచక్ర వాహనంపై అమరావతి బయలుదేరారు. పెనుమాక బొడ్రాయి సమీపంలో ఉన్న మలుపు వద్ద హరిశివాజి ద్విచక్ర వాహనాన్ని నిలపగా, వీరిని క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఎడమ వైపుకు వచ్చి బైక్‌కు తగలటంతో దుర్గారాణి ద్విచక్ర వాహనంపై నుంచి బస్సు వెనుక చక్రం కింద పడింది. బస్సు దుర్గారాణి నడుంపైకి ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హరిశివాజి నుంచి వివరాలు సేకరించి, బైక్‌ని, శివాజిని పోలీస్‌స్టేషన్‌కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీఏ పూర్తయిన వెంటనే ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్న తరుణంలో వీరిపై విధి కక్షకట్టింది. దుర్గారాణి మృతి చెందడంతో హరిశివాజి కన్నీరుమున్నీరుగా విలపించాడు. దుర్గారాణి తల్లిదండ్రులకు ఏమని సమాధానం చెప్పాలని, కలిసి జీవించాల్సిన తమ ఇద్దరిలో ఒకరిని దేవుడు తీసుకువెళ్లాడని, ఇద్దరినీ తన వద్దకు తీసుకెళితే బాగుండేదని హరిశివాజి రోదన చూపరులకు కంటతడి పెట్టించింది.