పాలమూరు డీపీఆర్‌ను ప్రజల ముందుంచాలి
-
టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి
జడ్చర్ల: పాలమూరు–రంగారెడ్డి ఎత్తి పోతల పథకానికి డీపీఆర్(డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్టు)ను ప్రజల ముందు ఉంచాలని, వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని టీపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ రిజర్వాయర్ పరిధిలోని నిర్వాసిత గ్రామాలు వల్లూరు, ఉందడాపూర్, కిష్టారం తదితర గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించారు. తమ ప్రభుత్వ హయాంలో జూరాల నుంచి 24 టీఎంసీల నీటిని తరలించే విధంగా రూ.7.50 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు తయారు చేశామని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ డిజైన్‌ను మార్చి శ్రీశైలం నుంచి వరదనీటిని తరలించే విధంగా మరో డిజైన్‌ను ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. డిజైన్ మార్పుల ఎందుకు చేపట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్‌చేశారు. అదేవిధంగా లోకిరేవులో రిజర్వాయర్‌ను నిర్మిస్తామని మొదట పేర్కొని తరువాత ఉదండాపూర్‌కు ఎందుకు మార్చారని ప్రశ్నించారు.
పాలమూరు ప్రాజెక్టుకు నార్లాపూర్ వద్ద నేషనల్ టైగర్ ప్రాజెక్టు అడ్డుకానుందన్నారు. ఇందుకు కేంద్రం అనుమతించాల్సి ఉందన్నారు. ఊళ్లను,భూములను ముంచే విధంగా రూపొందించిన 16 టీఎంసీల రిజర్వాయర్ సామర్థ్యాన్ని 6.08 టీసీఎంలకు తగ్గించాలని కోరారు. అదేవిధంగా 2013 చట్టం కాదని 123జీఓ ప్రకారంగా పరిహారం చెల్లించడం తగదన్నారు. కలెక్టర్ గ్రామాలకు వచ్చి రిజర్వాయర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అందించే పరిహారాన్ని సమగ్రంగా వివరించాలని కోరారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆయన స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు కేవలం రూ.10వేల కోట్లు కేటాయిస్తే జిల్లాలో 7.50లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కానీ ఆయా ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు. నిర్వాసితులకు అండగా ఉంటామని, అధికారుల బెదిరింపులకు ప్రజలకు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్, దేవరకద్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి పవన్‌కుమార్, గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు రవినాయక్, డీసీసీ నాయకులు జూపల్లి భాస్కర్‌రావు, నిత్యానందం, అశోక్‌యాదవ్, బుక్క వెంకటేశం, యాదయ్య, రేణుక పాల్గొన్నారు.