బాడీ ఫ్రీజర్లు ఉంచేందుకు నిర్మించిన గదులు, (ఇన్‌సెట్) డ్రగ్‌స్టోర్‌లో ఎండకు, వానకు తుప్పుపడుతున్న బాడీ ఫ్రీజర్లు
విలువైన ఫ్రీజర్లు ఎండపాలు
భవనం నిర్మాణమైనా నిరుపయోగం
కర్నూలు(హాస్పిటల్):
ఆసుపత్రిలో శవాలు ఏడుస్తున్నాయి. ఎందుకంటే.. వాటిని భద్రపరిచే డీప్ ఫ్రీజర్లు నిరుపయోగంగా మారాయి. రెండేళ్ల క్రితం ఆసుపత్రి, మెడికల్ కళాశాల అధికారులకు, వైద్యులకు తెలియకుండా, వారికి కనీస సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం లక్షలు వెచ్చించి కొనుగోలు చేసి వాటిని పంపింది. ఆ ఫ్రీజర్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ తుప్పుపడుతున్నాయి. గుర్రం కొనేందుకు ముందుగా తాడు కొన్నట్లు అధికారులు వీటిని కొనిపారేశారు. తర్వాత ఈ ఫ్రీజర్లు పెట్టేందుకు గాను రూ.10లక్షల అంచనాతో మార్చురీ వద్ద భవన నిర్మాణానికి టెండర్లు పిలిచారు.
నాలుగు నెలల క్రితం ఈ భవన నిర్మాణం సైతం పూర్తయ్యింది. అయితే ఫ్రీజర్లు పెట్టేందుకు అనువుగా లేవంటూ ఫోరెన్సిక్ అధికారులు ఈ భవనాన్ని స్వాధీనం చేసుకోలేదు. అదనపు వసతుల కోసం ఇంజినీరింగ్ అధికారులు మళ్లీ టెండర్లు పిలిచే పనిలో పడ్డారు. ఇప్పటిదాకా ఆ పని పూర్తి కాలేదు. మరోవైపు ఒక్కోసారి మార్చురీలో మృతదేహాలు ఎక్కువ కావడంతో శవాలను ఫ్రీజర్లలో గాకుండా నేలపైనే పడుకోబెడుతున్నారు. తాము చల్లగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన ఫ్రీజర్లు ఎండలో ఉంటున్నాయని, మరోవైపు భవన నిర్మాణం పూర్తయిన తమను అందులోకి తీసుకెళ్లడం లేదంటూ శవాలు ఏడుస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి తమ శరీరాలు పాడైపోకుండా చూస్తారని అవి కోరుకుంటున్నాయి.