ధర్మవరంలో ఢిల్లీ వైద్య బృందం పర్యటన
ధర్మవరం అర్బన్: పట్టణంలో మంగళవారం ఢిల్లీ నుంచి వచ్చిన వైద్య బృందం పర్యటించింది. డెంగీ బాధితులు 60 శాతానికి కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేలితే ఈ జ‍్వరానికి ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఈ సందర్భంగా బృందంలోని డాక్టర్ రమేష్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ యుగంధర్ తెలిపారు. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలో‍్లని 65 జిల్లాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి డెంగీ జ్వరం తీవ్రతను గుర్తించేందుకు రక్తనమూనాలు సేకరిస్తున్నట్లు వివరించారు.
జిల్లాలోని ధర్మవరం, హిందూపురం పట్టణాలతోపాటు రామగిరి మండలంలోని కుంటిమద్ది, యల్లనూరు మండలంలోని వెన్నపూసపల్లి గ్రామాల్లో పర్యటించి రక్త నమూనాలను సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, పట్టణంలోని 16వ వార్డులో వైద్యులు నాలుగు బృందాలుగా విడిపోయి ప్రజల నుంచి రక్తనమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు.