- డెల్టా ఆధునికీకరణ ఈ ఏడాదీ అనుమానమే
- అరకొరగా నిధులు విదిల్చిన సర్కారు
- కుదించుకుపోయిన క్లోజర్ గడువు
అంతంత మాత్రమేనా?
Published Mon, May 1 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 10:04 AM
అమలాపురం :
గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ఈ ఏడాది జరిగేది కూడా అంతంత మాత్రమేనని రైతులు భావిస్తున్నారు. నిధుల కేటాయింపులో భారీగా కోత పెట్ట డం.. కాలువల మూసివేత సమయం (క్లోజర్) కుదించుకుపోవడం రైతులు అనుమానాలను నిజం చేస్తున్నాయి. గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు 2008లో ఆరంభమయ్యాయి. రూ.1,760 కోట్లతో చేపట్టిన పనులు నాలుగేళ్లలో అంటే 2012–13 ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయాల్సి ఉంది. చాలా ప్యాకేజీలకు టెండర్లు ఖరారు కాకపోవడం.. టెండర్లు ఖరారైన చోట కాంట్రా క్టర్లు మట్టి పనులు చేసి చేతులు దులుపుకోవడంతో పనులు ఆశించిన స్థాయిలో పూర్తి కాలేదు. ఇప్పటి వరకు కేవలం రూ.400 కోట్ల పనులు మించికాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం నియమించిన ఎక్స్‌పర్ట్ కమిటీ కొన్ని పనులు తొలగించాలి్సందిగా నివేదిక ఇవ్వగా అందుకు ప్రభుత్వం అంగీకరించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అయిన పనులు... తొలగించిన పనులు పూర్తి కాగా, ఇంకా రూ.689 కోట్ల విలువైన పనులు జరగాల్సి ఉందని అంచనా. ఈ ఏడాది క్లోజర్ సమయంలో కనీసం రూ.170 కోట్ల విలువైన 373 పనులు చేయాలని అధికారులు ప్రతిపాదనలు పంపారు. దెబ్బతిన్న లాకులు, స్లూయిజ్‌లు, డైరెక్ట్ పైప్‌ల షటర్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం, మరమ్మతులు చేయడంతోపాటు రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, వంతెన నిర్మాణ పనులున్నాయి. అయితే ప్రభుత్వం బడ్జెట్‌లో కేవలం రూ.83.50 కోట్లు కేటాయించి చేతులు దులుపుకోవడం గమనార్హం. ఈ నిధులు సైతం రెండు జిల్లాల పరిధిలో డెల్టా ఆధునికీకరణకు కేటాయించారు. అంటే మనకు దీనిలో సగం మాత్రమే నిధులు రానున్నాయన్న మాట. గత ఏడాది రూ.325 కోట్లు ఆధునికీకరణ పనులకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం రూ.85 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇరిగేష¯ŒS అధికారులు ఈసారి పనులను కుదించి పంపినా ఫలితం లేకుండా పోయింది. ప్రభుత్వం యధావిధిగా అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది.
కుదించుకుపోయిన గడువు
క్లోజర్ గడువు ఈ ఏడాది కుదించుకుపోయింది. ఏప్రిల్ 15న కాలువలు మూసి జూ¯ŒS 15న తెరవడం ద్వారా 60 రోజుల క్లోజర్ గడువు అధికారులకు ఉండేది. కాని ఈ ఏడాది జూ¯ŒS ఒకటి నాటికి డెల్టాలో ముందస్తు సాగుకు నీరిస్తామని అధికారులు ప్రకటించిన నేపథ్యంలో క్లోజర్ గడువు కేవలం 45 రోజులు మాత్రమే దక్కింది. ఉన్న సమయమే తక్కువ అనుకుంటే ఇప్పటికీ కొన్నిచోట్ల పనులు ఆరంభం కాకపోవడం గమనార్హం. మధ్యడెల్టా పరిధిలో ఆత్రేయపురం మండలం లొల్ల– ముక్తేశ్వరం బ్రాంచ్ కెనాల్ పరిధిలో వాడపాలెం వెంకన్న ఆలయానికి వెళ్లేందుకు వీలుగా రూ.1.90 కోట్లతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు మాత్రమే కొంత వేగంగా సాగుతున్నాయి. మిగిలిన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కూడా ఆధునికీకరణ పనులు అటకెక్కినట్టేనని రైతులు అభిప్రాయపడుతున్నారు.
Advertisement
Advertisement