కోదాడ : ‘మున్సిపల్ కమిషనర్ ఎజెండా తయారు చేయడంలో పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారు...ఆయన వల్లే మున్సిపల్ సమావేశం నిర్వహించలేక పోతున్నాం..’ ఇది గతంలో కోదాడ పురపాలక పెద్దలు నిత్యం వల్లే వేసిన మాటలు. మూడు నెలలపాటు సమావేశం నిర్వహిచంకపోతే పాలకవర్గం రద్దు అవుతుందని ఎజెండా లేకుండానే ఆదరబాదరగా సమావేశం నిర్వహించారు. దీనకంతటికి కారణం పాత కమిషనరే సహకరించకపోవడమేనని చైర్‌పర్సన్ పదే పదే చెప్పేవారు. కాని పాత కమిషనర్ వెళ్లిపోయాడు. కొత్త కమిషనర్ వచ్చి నెలరోజులు దాటింది కాని.. నేటికీ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదు. అసలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పలే ని పరిస్థితి. దీంతో 14వ ఆర్థిక సంఘానికి చెందిన దాదాపు రూ.4 కోట్ల పనులు కౌన్సిల్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి. దీనికితోడు ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఆమోదం పొందక పోవడంతో ఐదు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు లేక అల్లాడుతున్నారు.
ఐదుశాతం కమీషన ముందే ఇవ్వాలి..?
కోదాడ మున్సిపాలిటీలో 14వ ఆర్థిక సంఘానికి చెందిన దాదాపు రూ.4కోట్ల విలువైన పనులకు గతంలో టెండర్లు పిలిచారు. వాటిని తెరిచారు. ఇక సమావేశంలో వాటిని పెట్టి ఆమోదించి కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్ ఇవ్వడమే తరువాయి. కాని పాత కమిషనర్‌కు, చైర్‌పర్సన్‌కు మధ్య ఉన్న విభేదాలతో సంవత్సర కాలంగా అవి వాయిదా పడ్డాయి. త్వరలో నిర్వహించే సమావేశ ఎజెండాలో సదరు పనులను పెట్టాలంటే ముందుగానే తమకు 5 శాతం వాట ఇవ్వాలని కొందరు పెద్దలు భేరం పెట్టినట్లు ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కోదాడ మున్సిపాలిటీలో పనిచేస్తున్న దాదాపు 15 మంది కాంట్రాక్టర్లు గత బుధవారం సమావేశమై దీనిపై తీవ్రంగా చర్చించినట్లు తెలిసింది. కొందరు ఇవ్వడానికి అంగీకరించగా మరికొందరు దీనిని తీవ్రంగా వ్యతిరేకించినట్లు తెలిసింది. ఇది ఎటూ తెమలకపోవడంతో సమావేశం నిర్వహించంకుండానే జూలై నెల గడిచిపోయింది.
పాపం..పారిశుద్ధ్య కార్మికులు..!
మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులను ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వీరి కాల పరిమితి మార్చి నెలతో ముగిసిపోయింది. ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టర్ లేక పోవడంతో కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. పాత కాంట్రాక్టర్ మార్చి నెల జీతం ఇవ్వలేదు. తరువాత నాలుగు నెలలు ఏజెన్సీ లేక పోవడంతో మొత్తం ఐదు నెలలుగా వారికి వేతనాలు లేవు. కొత్త ఏజెన్సీ టెండర్లు ఆమోదించడానికి కూడా భారీ మొత్తంలో కొందరు పాలకులు డిమాండ్ చేస్తుండడంతో ఇది కార్మికుల వేతనాలపై ప్రభావ చూపుతుందని కొందరు కౌన్సిలర్లే అంటున్నారు. మొత్తం మీద కౌన్సిల్ సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో, మరి ఈ ఆరోపణలకు ఎప్పుడు తెరదించుతారో వేచి చూడాలి.
ఆరోపణలు చేసేవారి గురించి ప్రజలకు తెలుసు –వంటిపులి అనిత, చైర్‌పర్సన్
కోదాడ మున్సిపాలిటీలో అవినీతి పరుడైన పాత కమిషనర్‌ను అడ్డుపెట్టుకొని పనులు జరగకుండా చేసినవారే ఇప్పుడు పసలేని ఈ ఆరోపణలు చేస్తున్నారు. వారి గురించి పట్టణ ప్రజలకు అంతా తెలుసు. మున్సిపాలిటీలో హరితహారం జరుగుతుంది. ఆగస్టు 3న మెగా ప్లాంటేషన్ చేయాల్సి ఉంది. అందువల్లే సమావేశం పెట్టడం ఆలస్యం అవుతుంది. ఎజెండా తయారవుతుంది. మరో వారం పది రోజుల్లో సమావేశం పెడతాము. పట్టణ ప్రజల సమస్యలు తీర్చడానికి కషి చేస్తున్నాం. ఈ లాంటి ఆరోపణలు పట్టించుకోం.
కమీషన్ల కోసమే కౌన్సిల్ సమావేశం వాయిదా..?
Published Sun, Jul 31 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
Advertisement
Advertisement