వణికిస్తున్న డెంగీ | dengi sheking | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న డెంగీ

Published Sat, Sep 17 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

వణికిస్తున్న డెంగీ

వణికిస్తున్న డెంగీ

కరీంనగర్‌ హెల్త్‌ : జిల్లా ప్రజలను డెంగీ వణికిస్తోంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రితోపాటు కరీంనగర్‌లోని మూడు అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, డాక్టర్స్‌ స్ట్రీట్‌లోని అన్ని ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో సైతం డాక్టర్‌ పిలుపుకోసం కనీసం ఐదారుగంటల  వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇక ప్రభుత్వ ప్రధానాస్పత్రిలోని పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఉదయం 9 గంటలకు ముందు నుంచే రోగులు చీటి కోసం  క్యూ కడుతున్నారు. ఆస్పత్రిలో మధ్యాహ్నం ఒంటిగంట వరకు మాత్రమే ఓపీ చీటి ఇస్తుండటంతో రోగులు ఎమర్జెన్సీ వార్డులో క్యూలు కడుతున్నారు.
500 పైగా డెంగీ కేసులు
జిల్లాలో 500 పైగా డెంగీ కేసులు నమోదు అయినట్లు సమాచారం. ప్రతిరోజు పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో నిర్వహిస్తున్న నర్సింగ్‌ స్కూల్‌ విద్యార్థినులకు డెంగీ ఉన్నట్లు ప్రభుత్వ వైద్యులే నిర్ధారించారు. దీంతో వ్యాధి ఉధృతి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. విష జ్వరంతో ప్రభుత్వాస్పత్రిలో చేరినవారు డెంగీ అని నిర్ధారణ కాగానే ప్రయివేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. 
 
 డెంగీ నిర్ధారిస్తే నోటీసులు..
డెంగీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినా రోగులకు ఈ విషయం చెప్పవద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆదేశాలు ఉండటంతో ప్రయివేటు ఆస్పత్రుల వైద్యులు పరీక్షల ఫలితాలు చెప్పడానికి వెనుకాడుతున్నారు. డెంగీ ఉన్నట్లు రిపోర్టు ఇస్తే వెంటనే వైద్య ఆరోగ్యశాఖ నుంచి నోటీసులు ఇస్తున్నారు. దీంతో ప్రయివేటు ఆస్పత్రుల నిర్వాహకులు కూడా డెంగీ నిర్ధారణ అయినా విష జ్వరంగానే రిపోర్టు ఇస్తున్నారు. రోగికి డెంగీ సోకినట్లు తమకు సమాచారం అందిస్తే బ్లడ్‌ శాంపిల్స్‌ను తీసుకుని హైదరాబాద్‌కు పంపించి పరీక్షలు చేసి నిర్ధారణ చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారని ఓ సీనియర్‌ ఫిజీషియన్‌ తెలిపారు.  
 
వెయ్యికి చేరుతున్న ఓపీ
విషజ్వరాలతో కారణంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఓపీ నిత్యం వెయ్యికి చేరుతోంది. వర్షం నీరు నిలిచిపోవడంతో జిల్లాలో పారిశుధ్యం లోపించి దోమలు పెరిగాయని, చల్లని వాతావరణంతో డెంగీ విజృంభిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు. జిల్లాలోని ఒక్కో మండలంలో 200 మందికి పైగా విషజ్వరాలతో బాధపడుతుండగా, వీరిలో కనీసం 10 మందిలో డెంగీ లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్లేట్‌లెట్స్‌ తగ్గాయని నిర్ధారణ కాగానే జ్వరపీడితులో ఆ్వస్పత్రిలో చేరుతున్నారు. దీంతో అన్ని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం 450 పడకలు ఉండగా అదనంగా మరో 100 పడకలు ఏర్పాటు చేశారు. అయినా అవి సరిపోవడం లే దు. ఓపీ మధ్యాహ్నం వరకే 700లకు చేరుతోంది. ఎమర్జెన్సీతో  సాయంత్రం వరకు వెయ్యి దాటుతోంది. కాగా, ఆస్పత్రిలో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇన్, ఔట్‌ పేషెంట్లకు నాలుగైదు గోలీలతోనే సరిపెడుతున్నారు. డాక్టర్‌ రాసినా సిబ్బంది అందులో సగం మందులు మాత్రమే ఇస్తున్నారని రోగులు చెబుతున్నారు.  
 
 
ప్లేట్‌లేట్స్‌ ఎక్కించినా తగ్గుతున్నయ్‌
తిరుపతి(ఇంజినీరింగ్‌ విద్యార్థి), హుస్నాబాద్‌
తీవ్ర జ్వరంతో 12వ తారీఖున ఆస్పత్రిలో చేరాను. విషజ్వరం వచ్చిందని రిపోర్టులో చెప్పారు. ఆస్పత్రికి వచ్చిన రోజు 88 వేలు ప్లేట్‌లేట్స్‌ ఉన్నాయి. మొన్నటి వరకు మూడు సార్లు ప్లేట్‌లేట్‌ ఎక్కించారు.  నిన్న రిపోర్టులో ప్లేట్‌లేట్‌ 48 వేలు ఉన్నాయి. ఈరోజు 36 వేలు మాత్రమే ఉన్నాయి. ఎందుకు తగ్గుతున్నాయో అర్థకం కావడం లేదు. ఇంకా నాలుగు ప్లేట్‌లేట్‌ ప్యాకెట్‌ కావాలని రాశారు. రక్తం ఇవ్వడానికి నా స్నేహితులు ఎవరూ ఇక్కడ లేరు. 
 
రిపోర్టు కోసం ఎదురుచూస్తున్న 
–మహ్మద్‌ గౌస్, రామగుండం 
15రోజులుగా జ్వరంతో బాధపడుతున్న. ప్లేట్‌లేట్స్‌ తగ్గిపోయాయని అక్కడ డాక్టర్‌ చెబితే నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చిన. ప్లేట్‌లేట్స్‌ పెరుగుతున్నయని చెబుతున్నారు. ఆరోగ్యం మెరుగ్గా అని పించడం లేదు. ఇంకా రక్తపరీక్షల రిపోర్టు రాలేదు. ఎప్పుడు వస్తుందో చెప్పడం లేదు. రోజు నాలుగు మాత్రలు ఇచ్చి గ్లోకోజ్‌ పెడుతున్నరు. రామగుండం అందరూ జ్వరాలతోనే బాధపడుతున్నరు.  
  • వీణవంక మండలం కొండపాకకు చెందిన కత్తిస్వామి వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. స్థానికంగా పరీక్షలు చేయించుకోగా విషజ్వరం కారణంగా రక్తంలో ప్లేట్‌లేట్స్‌ 60 వేలకు పడిపోయాయని తెలిపారు. మూడు రోజులక్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. ఇక్కడ పరీక్షల్లో 9 లక్షలు ఉన్నట్లు రిపోర్డులో తెలుపడంతో ఆశ్చర్యపోయారు. వ్యాధి నిర్ధారణలో తేడా ఉంటుండంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. 
 
  • మంథని మండలం దుబ్బపల్లికి చెందిన మల్లేశం జ్వరం కారణంగా రక్తంలో ప్లేట్‌లేట్స్‌ 38వేలకు పడిపోవడంతో మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. టైపాయిడ్‌తోపాటు కామెర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మూడు రోజులు అయినా  డెంగీ నిర్దారణ  రిపోర్టు ఇంకా రాలేదు. ప్రైవేటులో మందులు తెచ్చుకున్నట్లు బాధితుడు తెలిపాడు.
  • రామగుండంకు చెందిన పర్వీన్‌ 15రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్లేట్‌లే ట్స్‌ తగ్గిపోయి కాళ్లువాపులు వచ్చి నడువలేని పరిస్థితిలో ఉంది. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement