యానంపల్లిలో డెంగీ?
యానంపల్లిలో డెంగీ?
Published Wed, Aug 17 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 9:41 AM
డిచ్‌పల్లి : మండలంలోని యానంపల్లిలో కొందరు డెంగీతో బాధపడుతూ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోవర్ధన్, అరుట్ల సతీశ్, నర్సయ్యలు జ్వరంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో జరిపిన వైద్య పరీక్షల్లో వీరికి డెంగీ లక్షణాలు బయట పడ్డాయి. గ్రామంలో సుమారు 20 మంది వరకు విషజ్వరాలతో బాధపడుతున్నారు. గ్రామంలో మురికి కాల్వలు శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి వైరల్ వ్యాధుల భారిన పడుతున్నారు. వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల విషయంలో పంచాయతీ సిబ్బంది, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు హెచ్చరించినా ఫలితం లేకుండా పోతోంది. డిచ్‌పల్లిలో ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రి ఉన్నా వైద్యులు అందుబాటులో ఉండకపోవడంతో రోగులు చేసేది లేక జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి యానంపల్లిలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై ఇందల్వాయి పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కట్టా శుభాకర్‌ను సంప్రదించగా.. అధికారికంగా డెంగీ వ్యాధి నిర్ధారణ కాలేదని తెలిపారు. యానంపల్లిలో కొందరు వ్యక్తులు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న మాట వాస్తవమేనన్నారు. అయితే వారిలో ఎవరికి డెంగీ లక్షణాలు లేవని తెలిపారు. ఇప్పటికే గ్రామంలో సర్వే జరిపి బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
Advertisement