ఆత్మహత్యే శరణ్యం | desition to commit sucide | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యే శరణ్యం

Published Sat, Mar 26 2016 1:05 AM | Last Updated on Sun, Sep 3 2017 8:34 PM

ఆత్మహత్యే శరణ్యం

ఆత్మహత్యే శరణ్యం

ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇద్దరు కుక్‌ల మనస్థాపం
కస్తూర్బా గాంధీ విద్యాలయం మేడపై నుంచి దూకేందుకు యత్నం


  అడ్డుకున్న తోటి సిబ్బంద
నిరుపేద కుటుంబాలు.. ఆ చిరుద్యోగమే వారికి జీవనాధారం.. మీపై ఫిర్యాదులు వచ్చాయంటూ అధికారులు ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తొలగించారు. కనీసం దర్యాప్తు కూడా లేకుండా తమను రోడ్డున పడేయడం ఏమిటని మనస్తాపం చెందిన ఇద్దరు మహిళా కుక్‌లు ఆత్యహత్యకు యత్నించారు. తోటి సిబ్బంది అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. 

 రోలుగుంట : అధికారులపై ఆరోపణలు వస్తే దర్యాప్తుల పేరుతో కాలయాపన చేసే ఉన్నతాధికారులు చిరుద్యోగులపై మాత్రం తమ ప్రతాపం చూపుతున్నారు.  స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయంలో పనిచేస్తున్న  కురచ శాంతమ్మ,  మడ్డు అమ్మాజీ అనే వంట పనివారిపై గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ మేరకు వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ సర్వశిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) నుంచి  శుక్రవారం  ఉత్తర్వులు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రత్యేక అధికారి వై.త్రివేణి   కుక్‌లకు చెప్పి తక్షణం విద్యాలయం నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో మనస్థాపానికి గురైన ఇద్దరు మహిళా కుక్‌లు విద్యాలయం మేడపైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. తోటి సిబ్బంది పరుగున వె ళ్లి వారి ప్రయత్నాన్ని  అడుకోవడంతో ప్రమాదం తప్పింది.  సమాచారం అందుకున్న రోలుగుంట ఎస్‌ఐ జి.గోవిందరావు  విద్యాలయానికి వచ్చి ఎస్‌వో త్రివేణి, కుక్‌లతో చర్చించారు.

కుక్‌లపై తమ శాఖ ఉన్నతాధికారులకు  ఫిర్యాదులు వెళ్లాయని, ఆ మేరకు వారిద్దరినీ తొలగిస్తూ తమకు ఉత్తర్వుల అందాయని, వారిని కొనసాగించడం సాధ్యం కాదని ఎస్‌వో స్పష్టంచేశారు.   బాధిత  వంట పనివారు  మాట్లాడుతూ తాము ఏ తప్పూ చేయలేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తాము కూడా  తెలియజేశామన్నారు.   జిల్లా కలెక్టర్ యువరాజుకు కుడా తాము వినతులు పంపుకున్నామని చెప్పారు. దీనిపై పాఠశాల కమిటీ, అధికారులు విచారణ చేసిన తరువాత నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించినా,  ఎలాంటి విచారణ లేకుండానే తమను తొలగించడం అన్యాయమని వాపోయారు. తాము ఇక్కడ నుంచి వెళ్లబోమని అక్కడే ఎండలో ఉన్నారు.    ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఎండలోనే ఉండి నిరసన తెలిపారు. దీంతో శాంతమ్మ  సొమ్మసిల్లి పడిపోయింది. మహిళా హోమ్‌గార్డు ఆమె ముఖంపై నీళ్లుచల్లి సపర్యలు చేశారు. తరువాతఎస్‌ఐ కుక్‌లకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు.

కొత్తగా వచ్చాను.. విషయం తెలియదు
తన ముందు పనిచేసిన స్పెషలాఫీసర్ జానకి హయాంలో కుక్‌లపై ఫిర్యాదు చేశారు. తాను కొత్తగా రావడం  వలన వారి సమస్య తనకు తెలియదు. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకే కుక్‌లను తొలగించాం.   -త్రివేణి, స్పెషలాఫీసర్, కస్తూర్బా గాంధీ విద్యాలయం, రోలుగుంట

 రాజకీయం చేశారు
నేను తొమ్మిది సంవత్సరాలుగా  ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా విధులు నిర్వహిస్తున్నాను. నేను, తోటి కుక్ అమ్మాజి   రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వెళ్లినపుడు సరుకులు పట్టుకొని పోయినట్లు ఒక పత్రికలో (సాక్షి కాదు) తప్పుడు వార్త వచ్చింది. స్థానికులు కొందరు మార్గంలో అడ్డగించి మా నుంచి  సరుకులు పట్టుకున్నట్టు మూడు నెలల క్రితం కొందరు వార్త రాయించారు. రాజకీయం చేసి ఇపుడు తొలగించారు. మేము ఏ తప్పూచేయలేదు.             - కురచ శాంతమ్మ, బాధితురాలు

 ఫిర్యాదులో వాస్తవం లేదు
నాపై వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదుల్లో వాస్తవం లేదు. స్థానికుల రాజకీయానికి బలయ్యాను. వాస్తవాలపై ఉన్నతాధికారులు విచారణ చేసి న్యాయం చేయాలి. పాడి గేదెను అమ్మూకొని ఈ ఉద్యోగానికి పెట్టుబడి పెట్టి రెండేళ్ల కిందట చేరాను. స్కూల్ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఫిర్యాదుదారులతో బహిరంగ విచారణ జరిపించండి. తప్పుచేసినట్లు తేలితే అప్పుడు చర్యతీసుకోండి.                  -మడ్డు అమ్మాజీ, బాధిత కుక్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement