
బీభత్సమే..
- పల్లెలపై వానర మూకల దాడులు
- విసిగి వేసారిన జనం
- ఇళ్లు, దుకాణాలు, పంటల పొలాలపై దాడులు
- రోడ్డు వెళ్తున్నా ఊరుకోవు
- వీరవిహారం చేస్తున్న కోతులు
- బెంబేలెత్తిపోతున్న జనం
- వామ్మో, కోతులు.. అడవులను వదిలి జనారణ్యంలోకి చొరబడ్డాయి. వానర మూకల వీరవిహారానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్లు, పొలాలు, దుకాణాలపై దాడులకు దిగుతున్నాయి. రోడ్డున వెళ్లే వారిని సైతం భయపెడుతున్నాయి. ఇళ్లపై పెంకులను ధ్వంసం చేస్తున్నాయి. ఇళ్లు, దుకాణాల్లోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటలను నాశనం చేస్తున్నాయి. ఇలా ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వాటిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నా మళ్లీ గ్రామాల్లోకి చొరబడుతున్నాయి.
- మిరుదొడ్డి
మండలంలోని అందె, అల్వాల, చెప్యాల, లింగుపల్లి, మల్లుపల్లి, రుద్రారం, వీరారెడ్డిపల్లి, అల్మాజీపూర్, జంగపల్లి, ఖాజీపూర్, బేగంపేట, భూమపల్లి, అక్బర్‌పేట, కూడవెల్లి, మోతె, కాసులాబాద్, మిరుదొడ్డి, ఆరెపల్లి, ధర్మారం, కొండాపూర్ తదితర గ్రామాల్లో వానర మూకలు సంచరిస్తున్నాయి. విద్యార్థులు పాఠశాలలకు వెళ్తున్న క్రమంలో వెంటపడి భయపెడుతున్నాయి. ఎవరి చేతిలోనైనా తినుబండారాలు కనిపిస్తే చాలు అదరగొట్టి బెదరగొట్టి ఎత్తుకెళ్తున్నాయి. ఇళ్లల్లోకి చొరబడి నిత్యావసర సరుకులను చిందరవందర చేస్తున్నాయి. పెరట్లో పెరిగే చిన్నచిన్న పూల మొక్కలను నాశనం చేస్తున్నాయి.
కిరాణా దుకాణాల్లో చిరుతిళ్ల డబ్బాలను ఎత్తుకెళ్లడం పరిపాటిగా మారింది. ఇక చేసేది లేక ఇంటి యజమానులు, దుకాణాదారులు కర్రలు పట్టుకుని నిత్యం కాపలా కాస్తున్నారు. ఇంత చేసినా వానర మూకలు గుంపులు గుంపులుగా వచ్చి ఎదురు తిరుగుతున్నాయి. దీంతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇళ్లపైకెక్కి కూన పెంకులను ధ్వంసం చేస్తున్నాయి. ఇక పొలాలల్లో పడి రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. పంటలపై పడి నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. చేసేది లేక రైతులు పంట పొలాల్లోనే కాపలా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
అటవీ ప్రాంతం నుంచి జనారణ్యంలోకి..
మండలంలోని కొండాపూర్, అందె, మిరుదొడ్డి శివారుతో పాటు కాసులాబాద్, లక్ష్మీనగర్, మోతె గ్రామాలను ఆనుకుని విశాలమైన అటవీ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో గత రెండేళ్ల నుంచి కరువు తాండవిస్తుండటంతో వానర మూకలకు ఆహారం దొరకడం లేదని పలు గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. అటవీ ప్రాంతంలో ఆహారం దొరక్క వానర మూకలు జనారణ్యంలోకి అడుగు పెడుతున్నాయి. తిండి కోసం నానా హైరానా చేస్తున్నాయి.
కోతుల బెడద నివారణకు...
పంటలపై పడి తీవ్ర నష్టం కల్గించడంతోపాటు, ఇళ్లల్లో చొరబడి నానా హంగామా సృష్టిస్తున్న వానరాల నుంచి విముక్తి పొందడానికి మహారాష్ట్ర వాసులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఒక్కో గ్రామం నుంచి వానర మూకలను పట్టి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేయడానికి మహారాష్ట్రకు చెందిన వారితో రూ.4 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఒప్పందం ప్రకారం కోతులను బంధించి అటవీ ప్రాంతంలో వదిలి వేసినా... తిరిగి అవి జనారణ్యంలోకి వస్తున్నాయి. ఇప్పటికైనా కోతుల బెడద నుంచి విముక్తి కల్పించడానికి అధికారులు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
వెంటబడుతున్నాయి..
పాఠశాలకు వెళ్లేదారిలో కోతులు వెంటబడుతున్నాయి. దారిలో అడ్డగించి ముప్పు తిప్పలు పెడుతున్నాయి. చేతిలో ఏది కనబడినా భయపెట్టి లాక్కెళ్తున్నాయి. పాఠశాలకు వెళ్లాలంటేనే భయమేస్తోంది.
- మద్దెల ప్రవీణ్, విద్యార్థి
ఇళ్లల్లోకి చొరబడుతూ...
ఇళ్లల్లోకి చొరబడి సామన్లను చిందరవందర చేస్తున్నాయి. తినే వస్తువులు ఉంటే చాలు ఎత్తుకుపోతున్నాయి. వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తే ఎదురు తిరిగి భయపెడుతున్నాయి. కోతి చేష్టలతో వేగలేక పోతున్నాం.
- అనసూయ, మహిళ
పంట పొలాలను నాశనం చేస్తున్నాయి..
పంట పొలాలపై కోతుల మూకలు పడి సర్వనాశనం చేస్తున్నాయి. పంటలను కోతుల నుండి రక్షించుకోవడానికి రోజుల తరబడి కాపలా ఉంటున్నాం. అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి రక్షించేలా చర్యలు తీసుకోవాలి.
- రాజు, రైతు