హాంకాంగ్: హాంకాంగ్ జూ పార్కులో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా 10 రోజుల వ్యవధిలో 12 కోతులు మృతిచెందాయి. కొద్ది రోజుల క్రితమే జూపార్కులో ప్రమాదకర బ్యాక్టీరియా విస్తరణను అధికారులు గుర్తించారు.
మృతిచెందిన కోతులకు నిర్వహించిన పోస్ట్‌మార్టంలో జూ ఎన్‌క్లోజర్ల మట్టిలో ఒక రకమైన బ్యాక్టీరియా అధికంగా ఉన్నట్లు కనుగొన్నారు. తద్వారా ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం కోతులు సెప్సిస్ బారిన పడి మృతిచెందాయి. ఇన్ఫెక్షన్ వల్ల ఆ కోతులలోని కణాలు దెబ్బతిన్నాయి. ఫలితంగా అవయవాలు పనిచేయడం ఆగిపోయి, అవి మృతిచెందాయి. జూ కార్మికుల బూట్ల ద్వారా కలుషితమైన మట్టి జంతువుల ఎన్‌క్లోజర్‌లకు చేరిందని అధికారులు భావిస్తున్నారు. జంతువుల కోసం గుహలు, ఇతర ఆవాసాల నిర్మాణ పనుల సమయంలో కోతుల సామూహిక మరణాలు సంభవించాయి.
అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం మట్టి ద్వారా అంటువ్యాధులు సంక్రమించడమనేది సాధారణమే. కానీ జంతుప్రదర్శనశాలలలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదు. బ్యాక్టీరియా సంక్రమణ కారణంగా కాటన్ టాప్ టామరిన్, వైట్-ఫేస్డ్ సాకి, కామన్ స్క్విరెల్ మంకీ, డి బ్రజ్జాతో సహా పలుకోతులు మృతిచెందాయి. మెలియోయిడోసిస్ అనేది కలుషితమైన మట్టి, గాలి లేదా నీటితో సంపర్కం ద్వారా వ్యాపించే ఒక అంటు వ్యాధి. ఇదే కోతుల ప్రాణాలను తీసింది. హాంకాంగ్ జూ పార్కు నగరం నడిబొడ్డున 14 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇన్ఫెక్షన్ కారణంగా కోతులు చనిపోవడంపై జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఈ ఐదు నగరాల్లో.. మిన్నంటే దీపావళి సంబరాలు
Comments
Please login to add a commentAdd a comment