
దేవీ నమోస్తుతే
దసరా ఉత్సవాల నిర్వహణలో రెండో మైసూరుగా ఖ్యాతిగడించిన పసిడిపురి శోభిల్లుతోంది. శనివారం నుంచి దేవీశరన్నవరాత్రులు ప్రారంభం కానుండటంతో ప్రొద్దుటూరుకు కొత్త కళ వచ్చింది.
ప్రొద్దుటూరు కల్చరల్:
దసరా ఉత్సవాల నిర్వహణలో రెండో మైసూరుగా ఖ్యాతిగడించిన పసిడిపురి శోభిల్లుతోంది. శనివారం నుంచి దేవీశరన్నవరాత్రులు ప్రారంభం కానుండటంతో ప్రొద్దుటూరుకు కొత్త కళ వచ్చింది. కలకత్తా సెట్టింగ్, గుడియాతం వంటి కళ్లుమిరిమిట్లు గొలిపే పందిరి సెట్టింగ్‌లతో ఆలయాలు కళకళలాడుతున్నాయి. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని ఉత్సవ కమిటీల వారు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పుట్టపర్తి సర్కిల్, మైదుకూరురోడ్డు, జమ్మలమడుగు రోడ్డులలో భారీ దేవతా సెట్టింగులను ఏర్పాటు చేశారు. శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో ఆర్యవైశ్య సభవారు 126వ ఉత్సవాల సందర్భంగా అద్భుతమైన సినీ సెట్టింగ్‌లతో అమ్మవారిని తీర్చిదిద్దనున్నారు. శివాలయం రాజరాజేశ్వరి ఉత్సవకమిటీవారు తమిళనాడు అంబూరు చెందిన కళాకారులతో సెట్టింగ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
దసరా ఉత్సవాలు ప్రారంభం ఇలా..
శ్రీఅగస్త్యేశ్వరస్వామి ఆలయం నుంచి 102 మంది ఆర్యవైశ్యులు శనివారం ఉదయం 6.30 గంటలకు వేదపఠనంతో నవగంగ తీర్థములు శ్రీకన్యకాపరమేశ్వరిదేవి ఆలయానికి తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 8.30 గంటలకు అమ్మవారిశాల నుంచి మంగళవాయిద్యాలతో బయల్దేరి తెల్లాకుల శివయ్యగారి శ్రీనగరేశ్వరస్వామి ఆలయం నుంచి కన్యకాపరమేశ్వరి దేవి పురాణాన్ని ఆర్యవైశ్యులు తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే శివాలయం రాజరాజేశ్వరి ఉత్సవ కమిటీ వారు, రతనాల వెంకటేశ్వరస్వామి, శ్రీచెన్నకేశ్వస్వామి, రాజరాజేశ్వరి దేవి ఆలయ కమిటీల వారు కలశ పూజచేసి, ఊరేగింపుగా ఆలయానికి తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.