దేవీ నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం
-
భద్రకాళి ఆలయంలో వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే వినయ్, మేయర్
-
బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారి దర్శనం
-
శైల పుత్రీ, యోగ నిద్రా క్రమాల్లో పూజలు
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 4గంటలకు నిర్మాల్య సేవలు, సుప్రభాత పూజలు జరిపారు. సుగంధ ద్రవ్య పరిమళాలతో అమ్మవారిని అభిషేకించారు. ఈసందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి మాతను బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి, శైలపుత్రీ క్రమంలో పూజలు జరిపారు. అనంతరం అమ్మవారిని వృషభ వాహనంపై ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ , వేద పండితులు పార్నంది నర్సింహమూర్తి, టక్కరసు సత్యం ఆగమార్చన విధులు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, రేవతి దంపతులు, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్‌లు భద్రకాళి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు జరిపారు. వారికి ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ నన్నపునేని నరేందర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి మహదాశీర్వచనం అందజేశారు. మధ్యాహ్నం 2వేల మంది భక్తులకు అన్నదానం చేశారు.
బుకింగ్ కౌంటర్ ప్రారంభం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంటర్‌ను బ్యాంక్ రీజినల్ జనరల్ మేనేజర్ మణికందన్ ప్రారంభించి, ఈఓ అంజనీదేవికి కౌంటర్ తాళం చెవులను అందించారు. సాయంత్రం అమ్మవారికి యోగనిద్రా క్రమంలో పూజలు నిర్వహించి జింక వాహనంపై ఊరేగించారు. రాత్రి 9 గంటలకు మహాపూజ, కుమారీ, సువాసినీ పూజలు, మహానీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం మహా ప్రసాద వితరణ జరిపారు. ఈసందర్భంగా సాంస్కృతిక వేడుకల్లో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి బొడిగె లక్ష్మీ నారాయణ భాగవతార్ మహిషాసుర సంహారం, మహాలక్ష్మీ వైభవం హరికథలను ప్రదర్శించారు. భద్రాచలం సీతారాయచంద్రస్వామి దేవస్థానం స్థానాచార్యులు స్థలశాయి శాస్త్రీయ సంగీత ప్రదర్శన ఆకట్టుకుంది. కాశిబుగ్గ శ్రీదత్త కూచిపూడి కళాక్షేత్రం ప్రిన్సిపాల్ ముదిగొండ సునిత శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. కాగా, నేడు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి బ్రహ్మచారిణీ క్రమంలో పూజలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో సిబ్బంది కూచన హరినాథ్, కొత్తపల్లి వెంకటయ్య, అలుగు కృష్ణ , అశోక్, చింత శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.