విరిగిన ధనమ్మ మర్రి చెట్టు
- ఈదురు గాలులకు వెయ్యి ఎకరాల అరటితోట నేలమట్టం
- అంధకారంలో లంక గ్రామాలు
కపిలేశ్వరపురం (మండపేట): గోదావరి చెంత ఆహ్లాదకరంగా ఉన్న లంక గ్రామాలు సోమవారం కకావికలమయ్యాయి. ఉన్నట్టుండి విరుచుకుపడ్డ ఈదురు గాలులకు ఉద్యాన పంటలు నేలనంటాయి, జిల్లాలోపర్యాటక కేంద్రంగా గుర్తింపుపొందిన ధనమ్మ మర్రి ఆవరణలోని మర్రి చెట్టు నేలకొరిగింది. కేదారిలంక, వీధివారిలంక, నారాయణలంక గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల అరటి తోట కుప్పకూలిపోయింది. కురిసిన వర్షానికి నేలలోని కంద కుళ్ళిపోయే ప్రమాదముందని రైతులు వాపోతున్నారు. ఆయా గ్రామాల్లో ఎనిమిది విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లంక గ్రామాల ప్రజలు చీకటిమాటున బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. వీఆర్వో స్వామినాయుడు, సర్పంచి రంకిరెడ్డి సత్యవతి, పంచాయతీ అధికారులు పరిస్థితిని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేశారు.