ఉద్యోగం రాలేదని ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్ : పోలీస్ కానిస్టేబుల్‌కు ఎంపిక కాలేకపోయానని ఓ యువకుడు గురువారం రాత్రి అనంతపురం మండలం సోములదొడ్డి సమీపాన గల ఇస్కాన్ (రాధాపార్థసారథి) మందిర గోశాల పార్కులో ఆత్మహత్య చేసుకున్నాడు. రూరల్ ఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన బొజ్జన్న పెద్ద కుమారుడు రామాంజనేయులు(25) డిగ్రీ వరకు చదువుకున్నాడు. పోలీస్ కావాలనే కోరికతో కొన్నాళ్లుగా అనంతపురంలో స్నేహితులతో కలిసి రూం ఉంటూ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇటీవల వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో రామాంజనేయులు అర్హత సాధించలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన తమ్ముడు ఉద్యోగం చేస్తున్నా తాను నిరుద్యోగిగా ఉండిపోతున్నానని కుంగిపోయాడు. ఇక తల్లిదండ్రులకు భారం కాకూడదని భావించుకున్నాడు. గురువారం రాత్రి ఇస్కాన్ టెంపుల్ పార్కులోకి వెళ్లాడు. పొద్దుపోయిన తర్వాత వెంట తెచ్చుకున్న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయాన్నే గమనించిన ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సర్వజనాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో విగతజీవిగా కనిపించిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.