రోడ్డుపైనే మృత్యువు
రోడ్డుపైనే మృత్యువు
Published Sun, May 14 2017 10:23 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM
- బైకును ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు
- ఇద్దరు దుర్మరణం
- హైవేపై ప్యాపిలి సమీప పెద్దమ్మ డాబా వద్ద ఘటన
ప్యాపిలి: మటన్ తెచ్చుకుని ఆదివారం చేసుకుందామనుకున్న ఓ ఇద్దరిని జాతీయ రహదారిపై మృత్యువు కబళించింది. బైక్‌పై వెళ్తున్న వీరిని ప్యాపిలి సమీపంలో పెద్దమ్మ డాబా వద్ద వెనుక నుంచి వస్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్యాపిలీ సమీప జాతీయ రహదారిపై పెద్దమ్మ డాబా వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. డోన్ మండలం కొత్తకోట గ్రామానికి చెందిన బాలు అలియాస్ బాలకృష్ణ (38), రాముడు అలియాస్ వెంకటరాముడు (25) అన్నదమ్ముల పిల్లలు. ఆదివారం కావడంతో ఉదయాన్నే మాంసం తీసుకునేందుకు బైక్‌పై ప్యాపిలి వచ్చారు.
మాంసం తీసుకుని తిరిగి వెళ్తుండగా జాతీయ రహదారిని దాటుతుండగా కర్నూలు నుంచి ప్యాపిలి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును గమనించారు. ఈ బస్సును తప్పించుకున్న వారు వెనుక వస్తున్న కర్ణాటక బస్సును గమనించక ముందుకు వెళ్లారు. ఆ వెంటనే కర్నూలు - బళ్లారి వైపు వెళ్తున్న కెఎస్సార్‌టీసీ బస్సు(కేఏ 17 టీఎఫ్ 1732) ఢీకొంది. ఘటనలో ఇద్దరూ అక్కడిక్కడే మరణించారు. వేగంగా వస్తుండడంతో బస్సు మృతదేహాలను కొంత దూరం ఈడ్చుకెళ్లింది. బైకు నుజ్జునుజ్జయింది. బాలకృష్ణ ఆటో డ్రైవర్‌గా పని చేసి కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటరాముడు రైతు కూలీగా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య సరోజ, ఏడాది వయసున్న కుమారుడున్నారు. ప్యాపిలి ఎస్‌ఐ తిమ్మయ్య సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఘటనా స్థలంలో మిన్నంటిన రోదనలు ..
మాంసం తెస్తానని ఇంట్లో చెప్పి వచ్చిన వారు విగతజీవులుగా మారిన దృశ్యాలను చూసి బాధిత కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతుల భార్యలను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.
Advertisement
Advertisement