అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకే క్యాంపు రాజకీయాలకు చిరునామాగా మారిపోయింది.
∙ పుదుచ్చేరి రిసార్టు నుంచి దినకరన్ వర్గ ఎమ్మెల్యేల మకాం మార్పు
∙ ఆలయంలో పూజలు
∙ దినకరన్ అనుకూల సీడీలను విడుదల చేసిన మాజీ మంత్రి
అమ్మ మరణం తరువాత అన్నాడీఎంకే క్యాంపు రాజకీయాలకు చిరునామాగా మారిపోయింది. కేవలం ఎనిమిది నెలల కాలంలో రెండు క్యాంపు రాజకీయాలకు తెరదీసిన అమ్మ అనుచరులు సరికొత్త విధానానికి తెరదీశారు. ఇప్పటివరకు తమిళనాడును వదిలి పుదుచ్చేరికి వెళ్లి తాజాగా తెలంగాణబాట పట్టనున్నారు. పుదుచ్చేరి రిసార్టులోని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు చలో హైదరాబాద్ అంటూ పయనం
కానున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీలోనూ, ప్రభుత్వంపైనా తన పెత్తనాన్ని లేకుండా చేసిన సీఎం ఎడపాడి పళనిస్వామిపై ప్రతీకారం తీర్చుకునేలా టీటీవీ దినకరన్ రాజకీయ పావులు కదుపుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా 19 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ఉపసంహరింపజేశారు. అంతేగాక గత నెల 22వ తేదీన గవర్నర్‌కు మద్దతు ఉపసంహరణ లేఖలను స్వయంగా అందజేయించారు. దీంతో ఎడపాడి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ దశలో తమ వర్గ ఎమ్మెల్యేలు ఎడపాడి ప్రలోభాలకు గురికాకుండా పుదుచ్చేరిలోని ఒక రిసార్టులో వారిని ఉంచారు. వీరికి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తోడవడంతో దినకరన్ వర్గంలో ఎమ్మెల్యేల బలం 21కి పెరిగింది.
మద్దతు ఉపసంహరణ తరువాత ఎడపాడిని గవర్నర్ బలపరీక్షకు ఆదేశిస్తారని దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు ఆశించారు. అయితే ఇటీవల చెన్నైకి వచ్చిన గవర్నర్ ఇదంతా పార్టీ అంతర్గత కలహాలు.. తలదూర్చనని స్పష్టం చేయడంతో వారంతా కంగుతిన్నారు. క్యాంప్‌లో కొనసాగి ఇక ప్రయోజనం ఏమిటని డీలాపడిన ఎమ్మెల్యేలు ఇళ్లకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అంతేగాక రిసార్టు నాలుగు గోడల
మిగతా 2వ పేజీలో u మధ్య బోరు కొడుతోందని వ్యాఖ్యానించడం ప్రారంభించారు. ఎమ్మెల్యేల వైఖరితో కంగారుపడిన దినకరన్ వీరందరిని హైదారాబాద్‌కు మార్చాలని నిర్ణయించుకున్నారు. అక్కడైతే స్వేచ్ఛగా తిరిగినా ఎవరూ గుర్తుపట్టరూ, ఎడపాడి వర్గం వలవేసి అవకాశాలు తక్కువ అనే అభిప్రాయానికి వచ్చిన దినకరన్ శని, ఆదివారాల్లో తన వర్గ ఎమ్మెల్యేలను హైదరాబాద్ విమానం ఎక్కించాలని నిర్ణయించుకున్నారు. అనర్హత వేటుపై షోకాజ్ నోటీసులకు ఈనెల 5వ తేదీన 19 మంది ఎమ్మెల్యేలమంతా స్పీకర్‌ను విడివిడిగా కలుస్తామని ఆ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ శుక్రవారం తెలిపారు. స్పీకర్ వద్దకు వారంతా పుదుచ్చేరి నుంచా లేదా హైదరాబాద్ నుంచి వస్తారా అనే విషయంలో స్పష్టమైన సమాచారం లేదు.
పోటీగా మరో సీడీ విడుదల
శశికళ, దినకరన్‌లను విమర్శిస్తూ చేసిన ప్రసంగాల సీడీని మంత్రి ఉదయకుమార్ గత నెల 31వ తేదీన విడుదల చేయగా, ఇందుకు బదులుగా దినకరన్ మద్దతుదారు, మాజీ మంత్రి సెందమిళ్ సెల్వన్ శనివారం ఒక సీడీని విడుదల చేశారు. ఈ సీడీలో శశికళను ప్రశంసిస్తూ జయలలిత చేసిన ప్రసంగాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. అలాగే పెరియకుళం ఎన్నికల ప్రచారాల్లో అప్పటి అన్నాడీఎంకే అభ్యర్థి దినకరన్‌ను పొగుడుతూ చేసిన ప్రసంగాలను పొందుపరిచినట్లు ఆయన చెప్పారు. అంతేగాక పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ముఖ్యమంత్రిగా చేయాలని ఎడపాడి, పన్నీర్ వర్గాలు శపథం చేసిన దృశ్యాలను ఈ సీడీల్లో చూడవచ్చని ఆయన తెలిపారు. శశికళ తల్లిలా తనను చూసుకుంటుందని ప్రధాని సమక్షంలోనే జయలలిత పొగిడినట్లుగా ఆయన అన్నారు. సీఎం ఎడపాడి వర్గానికి అందుబాటులో లేకుండా పుదుచ్చేరిలో రిసార్టులో తలదాచుకుని ఉన్న దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు అక్కడి ఆలంగుడి ఆలయంలో గురుప్రవేశ (గురుపెయర్చి) పూజలను నిర్వహించారు. పూజలు ముగిసిన అనంతరం తిరిగి రిసార్టులోకి వెళ్లిపోయారు.