ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వివక్ష
ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వివక్ష
Published Thu, May 11 2017 10:25 PM | Last Updated on Wed, Jul 10 2019 8:16 PM
- అభివృద్ధి పనులకు నిధులిస్తే ఒట్టు
- పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన
బేతంచెర్ల : దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని పీఏసీ చైర్మన్, డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలున్న చోట నిధులే ఇవ్వకుంటే అభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. బేతంచెర్ల పంచాయతీ కార్యాలయంలో గురువారం ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మూడేళ్ల టీడీపీ పాలనలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు. నిధులు మంజూరు చేస్తే అభివృద్ధి పనులు చేపట్టి ప్రజాదరణ పొందుతారనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నట్లు ఆరోపించారు. అసలే రాయలసీమ కరువు పీడిత ప్రాంతమని, ఆపై డోన్ నియోజకవర్గ పరిస్థితి మరీ దయనీయమన్నారు. నిధులిస్తే బోర్లు వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించుకుంటామని అడిగితే గతంలో ఉన్న కలెక్టర్ పట్టించుకోలేదన్నారు. బేతంచెర్ల సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తుంటే టీడీపీ నాయకులు ట్యాంకర్లు పెట్టి తోలుతూ శాశ్వత పరిష్కారాన్ని మరుగునపెడుతున్నారన్నారు. నీరు- చెట్టు కార్యక్రమంతో టీడీపీ నేతలు జేబులు నింపుకోవడం తప్పా ప్రజలకు ఒరిగిందేమి లేదని బుగ్గన అన్నారు.
పెత్తనం జన్మభూమి కమిటీలకు ఇవ్వడమేంటి?
మండలానికి 300 గృహాలు మంజూరు చేశామని చెబుతున్న ప్రభుత్వం వాటిపై పెత్తనం జన్మభూమి కమిటీలకు ఇస్తే వారు అర్హులకు ఎలా న్యాయం చేస్తారని బుగ్గన ప్రశ్నించారు. పంటలను రక్షించడం పేరుతో రెయిన్‌గన్ల కొనుగోలుకు వంద కోట్లు, వాటి నిర్వహణకు మరో వంద కోట్లు ఖర్చు చేశారని, వాటితో ఎక్కడ పంటలు పండించారో చెప్పాలని ప్రశ్నించారు. ఏ కొత్త పథకం ప్రవేశపెట్టినా టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మేలు జరుగుతోందే తప్ప ప్రజలకు ప్రయోజనం ఉండడం లేదన్నారు.
Advertisement