సర్దన.. వ్యాధులతో హైరానా
- అస్తవ్యస్తంగా డ్రై నేజీ వ్యవస్థ
- పేరుకుపోతున్న పారిశుద్ధ్యం
- పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు
- ఇద్దరికి మలేరియా
- పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు
మెదక్‌రూరల్:వర్షాకాలం ప్రారంభమైంది.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.. గ్రామల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కలెక్టర్ మొదలుకొని తహశీల్దార్ వరకు వారం వారం వీడియోకాన్ఫరెన్స్‌లలో పదే పదే చెబుతూనే ఉన్నారు.
అయినప్పటికీ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో సీజనల్ వ్యాధులు పొంచి ఉండగా, ఇప్పటికే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మెదక్ మండలంలోని సర్ధన గ్రామంలో మురికి కాల్వలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్యం పేరుకుపోయింది. అలాగే మురికి కాల్వలపై ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి.
మరోవైపు మురికి కాల్వల్లో ఎక్కడికక్కడ మురికి నీరు నిల్వ ఉండటంతో గ్రామంలో దోమలు, ఈగలు విపరీతంగా వద్ధి చెందాయి. దీంతో రాత్రి పగలు అనే తేడాలేకుండా ప్రజలు దోమలు, ఈగలతో అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. దోమలు విపరీతంగా పెరగడంతో ప్రజలు మలేరియా వంటి వ్యాధులకు గురికావస్తుంది. ఇప్పటికే గ్రామంలోని శ్రీకాంత్, దాసు అనే ఇద్దరు వ్యక్తులు మలేరియా వ్యాధికి గురికాగా, మరికొంతమంది వాంతులు, విరేచనాలకు గురై ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు.
ప్రజాప్రతినిధులుగాని, అధికారులుగాని పట్టించుకోక పోవడంతో ప్రజలంతా దోమలతో మలేరియా వ్యాధులకు గురవుతుండగా, ఈగలతో వాంతులు, విరేచనాలకు గురవుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, దోమల నివారణ మందులు వేయించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి గ్రామప్రజలను సీజనల్ వ్యాధులనుంచి రక్షించాలని పలువురు కోరుతున్నారు.
ఇద్దరు మలేరియాకు గురయ్యారు:
గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించక పోవడంతో మురికి కాల్వల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. దీంతో విపరీతంగా దోమలు, ఈగలు పెరిగిపోయాయి. ఫలితంగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మలేరియాకు గురికాగా, చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి.
–రాంచందర్, సర్ధన గ్రామస్తుడు
ఎవరూ పట్టించుకోవడం లేదు:
గ్రామంలో పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నా అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రామంలో సమస్యలపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించాం. అయినప్పటికీ అధికారులు ఎవరు మా గ్రామంవైపు కన్నెత్తి చూడటం లేదు. డ్రై నేజీలతోపాటు రోడ్లు కూడా అధ్వాన్నంగానే ఉన్నాయి. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికి గ్రామానికి చెందిన రోడ్లు ఎక్కడికక్కడ గుంతలమాయంగా మారి ప్రజలు కాలి నడకన కూడా నడవలేని స్థితికి చేరింది.
–కిరణ్‌కుమార్, సర్ధన గ్రామస్తుడు.
మలేరియా వచ్చింది
గ్రామంలో విపరీతంగా దోమలు ఉన్నాయి. మురికి కాల్వలు శుభ్రం చేయడం లేదు. గ్రామంలో దోమలు, ఈగలు పెరిగిపోయి వ్యాధులు ప్రబలుతున్నాయి. నేను ఇటీవల మలేరియాకు గురికాగా ప్రై వేట్ ఆస్పత్రికి వెళ్తే వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి.
–శ్రీకాంత్, మలేరియా బాధితుడు