
క్యాష్ లెస్ అమలులో జిల్లా రికార్డు
విజయవాడ : నగదు రహిత లావాదేవీల నిర్వహణలో భారతదేశం మొత్తం మీద జిల్లా రికార్డు సాధించిందని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. శనివారం ఆయన విజయవాడ క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నగదు రహిత లావాదేవీల అమలులో జిల్లా ప్రత్యేక ప్రోత్సాహక బహుమతి కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకోనుందన్నారు. జిల్లాలో 10,21,977మంది తెల్ల రేషన్‌కార్డుదారులలో డిసెంబర్‌లో 4,76,032 కార్డుదారులు నగదు రహితంగా రేషన్ తీసుకున్నారని వివరించారు. జిల్లాలో 46.5శాతం క్యాష్‌లెస్ లావాదేవీలు జరిపి దేశంలోనే పెద్ద రికార్డు సాధించామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లక్ష కంటే ఎక్కువ క్యాష్‌లెస్ లావాదేవీలు జరగలేదన్నారు. కృష్ణాజిల్లాలో ఎప్పటినుంచే ఈ–పోస్ అమలులో ఉండటం వల్ల ఇది సాధ్యమైందన్నారు.
రేషన్ డీలర్లతో బ్యాంకింగ్ కార్యకలాపాలు
జిల్లాలో 993 గ్రామాల్లో 2,161 రేషన్ డీలర్లతో బ్యాంకింగ్ కార్యకలాపాలను జరిపించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వీరిని బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్లుగా మార్పు చేస్తామని చెప్పారు. ఇప్పటికే 600 మందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. ఈనెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్ డీలర్లను బిజినెస్ కరస్పాండెంటులుగా నియమిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.
వ్యాపార సంస్థల్లో కూడా పాస్ డివైజర్లు
పట్టణాలు, గ్రామాల్లో సైతం ఈ–పాస్ డివైజర్లు అన్ని షాపులలో ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 32వేల షాపులను ఎంపిక చేశామని చెప్పారు. వారిలో రూ. 5 లక్షల వ్యాపారం కంటే అధికంగా లావాదేవీలు జరిపే వ్యాపారులతో వాణిజ్యపన్నుల శాఖాధికారులు, గ్రామాల్లో చిన్నచిన్న వ్యాపారులతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు పాస్ డివైజర్లు ఏర్పాటు చేయిస్తున్నారని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 32 వేల షాపులలో పాస్ డివైజర్లు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని రానున్న 15 రోజుల్లో పూర్తిచేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని వివరించారు.
పోటో జెసీ 17 వీఐజీ 40ఏ, జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు