సిబ్బంది పనితీరుపై ఎస్పీ అసంతృప్తి
సిబ్బంది పనితీరుపై ఎస్పీ అసంతృప్తి
Published Tue, Oct 4 2016 7:15 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
సామర్లకోట :
సామర్లకోట పోలీసు స్టేషన్ సిబ్బంది పనితీరుపై జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సామర్లకోట పోలీసు స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌ను ముందుగా తనిఖీ చేస్తున్నట్లు సమాచారం ఉన్నా రికార్డులు సక్రమంగా లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్‌స్పెక్షన్ అంటే లెక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయని వాటిని అరికడతామని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానంపై కానిస్టేబుల్ నుంచి ఎస్సై వరకు అందరికీ హైదరాబాద్, విజయవాడల్లో శిక్షణలు ఇస్తామని చెప్పారు. బ్యాంకులు, ఏటీఎంలో నేరాలు పెరిగిపోయాయని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు వేగంగా పరిష్కరిస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యను నియంత్రించడానికి అదనపు పోలీసులను భర్తీచేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన మండలాల కోసం అదనంగా 200 మంది సిబ్బంది కావాలని కోరామన్నారు. సామర్లకోట స్టేషన్‌కు వచ్చిన జిల్లా ఎస్పీకి డీఎస్పీ ఎస్. రాజశేఖరరావు, సీఐ ఎస్.ప్రసన్నవిజయగౌడ్, ఎస్సైలు ఎ.మురళీకృష్ణ, లక్ష్మీకాంతం స్వాగతం పలికారు. సుమారు రెండు గంటల పాటు రికార్డులను ఆయన తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.
Advertisement