జిల్లావ్యాప్తంగా వర్షం..
1.14 సెంటీమీటర్లుగా నమోదు
జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 1.14 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారుల గణాకాంలు చెబుతున్నాయి. సరూర్‌నగర్, మల్కాజిగిరి డివిజన్లలో గత కొంత కాలంగా మేఘాలు మురిపిస్తున్నప్పటికీ.. వర్షాలు మాత్రం కురవడం లేదు. దీంతో కరువు పరిస్థితులు పునరావృతమవుతాయని భావిస్తున్న తరుణంలో బుధవారం కురిసిన వర్షం కొంత ఊరటనిచ్చింది. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో భారీ వర్షమే కురిసింది. అదేవిధంగా చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల్లోనూ వర్షం హర్షించింది.
17 మండలాల్లో లోటు..!
ఇప్పుడిప్పుడే వర్షాలు ఊపందుకుంటున్నాయి. ఈ సీజన్లో తాండూరు, వికారాబాద్, పరిగి నియోజకవర్గాల్లో వానలు ఆశాజనకంగా ఉన్నాయి. చెరువులు, కుంటల్లో నీరు చేరడంతో భూగర్భ జలాలు సైతం క్రమంగా పుంజుకుంటున్నాయి. ఈ మూడు నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా చోట్ల లోటు వర్షపాతమే నమోదైంది. 17 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నాయి. ఇందులో ఎక్కువగా సరూర్‌నగర్, మల్కాజిగిరి డివిజన్ల పరిధిలోని మండలాలే అధికం. 10 మండలాల్లో సాధారణ వర్షపాతం ఉండగా.. 10 మండలాల్లో మాత్రం అధిక వర్షపాతం నమోదైంది.