పాదయాత్రపై పైశాచికం
-
సీపీఎం ఆధ్వర్యంలో బాధితుల ఆందోళన
-
పంపాదిపేట నుంచి కాకినాడకు పయనం
-
జనసంద్రంతో కిక్కిరిసిన బీచ్‌రోడ్డు
-
తీరప్రాంత గ్రామాల మీదుగా సాగిన యాత్ర
-
అడ్డుకున్న పోలీసులు.. అరెస్టులు
తొండంగి:
తీర ప్రాంతంలో కాలుష్య కారక దివీస్ ల్యాబొరేటరీస్‌కు వ్యతిరేకంగా కోనదండు కదిలింది. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం తాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట, శృంగవృక్షంపేట గ్రామాలకు చెందిన వందలాదిమంది వృద్ధులు, మహిళలు, రైతులు కలిసి పంపాదిపేట నుంచి కాకినాడ కలెక్టరేట్ వరకూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పంపాదిపేట వీధుల్లో సాగిన ఈ యాత్ర శృంగవృక్షంపేట, వాకదారిపేట, గోర్సపాలెం, గడ్డిపేట చేరుకుంది. అక్కడి నుంచి బీచ్‌రోడ్డు మీదుగా బుచ్చియ్యపేట, ఆవులమంద, పెరుమాళ్లపురం, తలపంటిపేట, హుకుంపేట, పాతచోడిపల్లి గ్రామాల మీదుగా సాగింది. ’ప్రాణాలు తీసే దివీస్ మాకొద్దు బాబోయ్’, ప్రభుత్వం దివీస్‌ను రద్దు చేయాలని, అక్రమ కేసులు ఎత్తి వేయాలని, 144 సెక్ష¯ŒS రద్దు చేయాలని, రైతుల భూములను ఇచ్చేదిలేదంటూ నినాదాలు చేశారు. అనంతరం ఉప్పాడ కొత్తపల్లి మండలం మీదుగా పాదయాత్రను కొనసాగించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు వేణుగోపాల్, సీపీఎం నాయకులు అప్పారెడ్డి, సింహాచలం, కొత్తపాకలు, తాటియాకులపాలెం, పందిపేటల, శృంగవృక్షంపేట తదితర గ్రామాల ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
కాలుష్యానికి వ్యతిరేకంగా సీపీఎం పోరాటం
జిల్లాలో జరుగుతున్న భూ పోరాటంతోపాటు పర్యావరణ కాలుష్యానికి వ్యతిరేకతే ప్రధాన అజెండాగా సీపీఎం జిల్లాలో మూడు చోట్ల పాదయాత్రలు నిర్వహిస్తున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి అన్నారు. పంపాదిపేటలో ఆయన మాట్లాడుతూ పెద్దాపురంలో సీఫుడ్ పరిశ్రమలో గ్యాస్ లీకై యాభైమంది ఆస్పత్రి పాలయ్యారన్నారు. దీనికి నిరసనగా పరిశ్రమలో సరైన భద్రత సౌకర్యాలు కల్పించాలని, మరొకట్టి గండేపల్లి రైసుమిల్లు వల్ల వస్తున్న కాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ పాదయాత్ర జరుగుతుందన్నారు. ప్రధానంగా దివీస్ పరిశ్రమ భూసేకరణకు వ్యతిరేకించడంతోపాటు కాలుష్యం వల్ల వచ్చే ప్రమాదాన్ని మందుగానే పారద్రోలేందుకు పాదయాత్రలు చేపట్టామన్నారు. ఈ నెల 14న అన్ని పాదయాత్రలు కూడా జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుంటాయన్నారు.
– జిల్లా కార్యదర్శి శేషుబాబ్జి
దివీస్ ఉద్యమం ఇతర ప్రాంతాలకు స్ఫూర్తి
కోన తీరంలో జరుగుతున్న దివీస్ వ్యతిరేక ఉద్యమం పలు పోరాటాలకు స్ఫూర్తినిచ్చిందని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.నరసింహారావు అన్నారు. కోన ప్రాంత ప్రజలంతా ధైర్యంతో దివీస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. దివీస్ కోసం ప్రభుత్వం 500 మంది పోలీసులను మూడు నెలల నుంచి మోహరించి వారికి జీతాలిస్తున్నారని, ఆ జీతాలకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కోర్టులో కూడా పోరాటం చేయలేని స్ధితిలో దివీస్ యాజమాన్యం, ప్రభుత్వం ఉందన్నారు.
– నరసింహారావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు