రొట్టెల కోసం ఆరాటం | divotees rush continued | Sakshi
Sakshi News home page

రొట్టెల కోసం ఆరాటం

Published Sun, Oct 16 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

రొట్టెల కోసం ఆరాటం

రొట్టెల కోసం ఆరాటం

  •  స్వర్ణాల చెరువు వద్ద భక్తుల కోలాహలం
  •  షహీదులకు ఘనంగా తహలీల్‌ ఫాతెహా
  •  అలరించిన క్రాకర్స్‌ షో
  • నేడూ కొనసాగనున్న పండుగ
  • నెల్లూరు(అర్బన్‌) : బారా షహీద్‌ దర్గాలో శనివారం కూడా భక్తుల కోలాహలం కొనసాగింది. దేశ, విదేశాలతో పాటు స్థానికులు కూడా ఎక్కువగా తరలివచ్చారు. వీరితో దర్గా ప్రాంగణం కిక్కిరిసింది. నాలుగో రోజు నిర్వహించిన తహలీల్‌ ఫాతెహాకు వేలాదిమంది హాజరయ్యారు. స్వర్ణాల చెరువు తీరంలో రొట్టెల మార్పిడి కొనసాగుతూనే ఉంది. భక్తులు రొట్టెల కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. ఆరోగ్యం, విద్య, వివాహం, సౌభాగ్యం, విదేశీయానం, పదోన్నతి, సంతానం, నూతన గృహాల రొట్టెలను భక్తులు ఎక్కువగా ఇచ్చి పుచ్చుకున్నారు. ఆదివారం కూడా పండుగ కొనసాగనుంది.
     
    కులమతాలకు అతీతంగా..
    రొట్టెల పండుగ ఈ నెల 12వ తేదీ బుధవారం రాత్రి మత గురువులు బారాషహీదులకు సొందల్‌ మాలిక్‌ను లేపనం చేయడంతో ప్రారంభమైంది. కులమతాలు, ప్రాంతాలు, సంప్రదాయాలకు అతీతంగా తమ కోర్కెలు తీరాలంటూ అనేకమంది భక్తులు సంకల్పిచారు. పాకిస్తాన్‌, దుబాయ్‌ తదితర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చారు. తమ కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో పుణ్యస్నానమాచరించారు. రొట్టెలు మార్చుకున్నారు. బారాషహీదులను దర్శించుకుని వరములిమ్మని మొక్కుకున్నారు. 
     
    నెల్లూరుకే ప్రత్యేకత 
    రొట్టెల పండుగ దేశంలోనే గుర్తింపు పొందింది. నెల్లూరు బారాషహీద్‌ దర్గా వద్ద జరిగే ఈ పండుగ నెల్లూరుకే ప్రత్యేకతను తెచ్చింది. ప్రభుత్వం సైతం గత సంవత్సరం రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి నిధులు విడుదల చేసింది. కోర్కెలు తీరిన వారు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదులుతారు. కొత్తగా కోర్కెలు కోరే వారు ఆరొట్టెలు అందుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది. 
     
    తహలీల్‌ ఫాతెహాతో ముగిసిన పండుగ 
    శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ముజావర్లు, మతగురువులు తహలీల్‌ ఫాతెహా నిర్వహించారు. బిందె నిండా గంధాన్ని తీసుకుని ఫకీర్ల జరుబులు(తప్పెట్లు)తో దర్గా చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. గంధాన్ని బారాషహీదులకు లేపనం చేశారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గంధాన్ని భక్తులకు పంచి పెట్టారు. అనంతరం పండుగ ముగిసినట్టు మత పెద్దలు ప్రకటించారు. ఈ తహలీల్‌ ఫాతెహాలో దర్గా కమిటీ అధ్యక్షుడు జంషీద్, దర్గా ముజావర్‌ రఫీ, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ అహ్మద్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.
     
    ఆదివారం కూడా ప్రత్యేక ఏర్పాట్లు 
    పండుగ ముగిసినప్పటికీ భక్తుల రద్దీ తగ్గడం లేదు. మధ్యాహ్నం పలుచగా ఉన్న భక్తులు సాయంకాలం అయ్యే సరికి ఒక్కసారిగా పెరిగిపోతున్నారు. రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిటకిటలాడుతున్నాయి. అధికారులు 15లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఇప్పటికి 12లక్షల మంది వచ్చినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజులు కూడా భక్తులు దర్గాకు రానున్నారు. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు పండుగ ముగిసినప్పటికీ ఆదివారం కూడా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు యథావిథిగా కల్పిస్తున్నారు. పారిశుద్ధ్య పరిరక్షణ, లైటింగ్, తాగునీరు తదితర వసతులు కొనసాగిస్తున్నారు. 
     
    ఉద్యోగం , ఆరోగ్య రొట్టెలకు డిమాండ్‌ 
    ఈ దఫా నిర్వహించిన పండుగలో ఉద్యోగం, ఆరోగ్య రొట్టెల కోసం డిమాండ్‌ కన్పించింది. పలువురు నిరుద్యోగులు ఉద్యోగం రొట్టె కోసం తిరిగారు. ఆరోగ్యం కోసం అనేకమంది రొట్టెలు మార్చుకున్నారు. కొంతమంది తమ బిడ్డలకు మంచి సంబంధాలు రావాలని కోరుకుంటూ పెళ్లి రొట్టెలు మార్చుకున్నారు. గతంలో రొట్టె పట్టుకుని పెళ్లయిన నూతన దంపతులు ఈ సంవత్సరం రొట్టెలు వదిలారు. 
     
    నేడు అవార్డులు 
    పండుగ నిర్వహణలో కష్టపడి పని చేసిన అధికారులకు, సిబ్బందికి ఆదివారం అవార్డులు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌తో ఎమ్మెల్యేలు, అధికారులు  తదితరులు పాల్గొననున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement