ధరలు మోగినా.. దివాళి తగ్గలే
హైదరాబాద్: మహా నగరాన్ని ఆనంద డోలికల్లో ముంచే వెలుగుల పండుగ దీపావళి. ఈ రోజు చీకటి పడక ముందే తారాజువ్వ పెకైగరాలి.. ఇంటి ముందు టపాసులు పేలాలి.. చిచ్చుబుడ్లు వెలుగులు విరజిమ్మాలి.. సీమ టపాకాల కాల్పులతో వీధి మోతెక్కిపోవాలి. వాటిని కాలుస్తూ మనసు నిండా ఆనందం నిండిపోవాలి. కానీ ఈ ఏడాది బాణసంచా ధరలు బాగా పేలాయి. అయినా సరే గిరాకీతో విక్రయాలు రాకె ట్లలా పైపైకి దూసుకెళ్లాయి. పండుగ సందర్భంగా నగరంలో మంగళవారం పలుచోట్ల బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసినా.. ఓ ప్రాంతంలో కొనుగోళ్లతో కిటకిటలాడాయి. మరోచోట వ్యాపారం లేక వెలవెలబోయాయి.
సనత్‌నగర్, సికింద్రాబాద్, మలక్‌పేట, ఉస్మాన్‌గంజ్, తదితర ప్రాంతాల్లోని హోల్‌సేల్ దుకాణాల న్నీ మంగళవారం కోనుగోళ్లతో కిటకిటలాడాయి. అయితే, గ్రేటర్‌లోని ఇతర ప్రాంతాల్లోని ఏర్పాటు చేసిన దుకాణాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వినియోగదారులు మాత్రం బాణ సంచాలో కొత్త వెరైటీస్ కోసం ఆరా తీయడం కన్పించింది. సోమవారం నెమ్మదిగా ప్రారంభమైన కొనుగోళ్లు మంగళవారం ఊపందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే 20 శాతం మేర విక్రయాలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. శివారు ప్రాంతాల్లో మంగళవారం కూడా బాణ సంచా కొనుగోళ్లు నెమ్మదిగా సాగడం రిటైల్ వ్యాపారులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి గతంలో 10 రోజుల ముందునుంచే నగరంలో దీపావళి బాణాసంచా కొనుగోళ్ల సందడి కన్పించేది. దిగుమతులు, ఎగుమతులు, క్రయ విక్రయాలతో మార్కెట్లన్నీ నిండుగా ఉండేవి. ఈసారి భద్రత దృష్ట్యా బాణ సంచా విక్రయాలపై పోలీసు శాఖ పక్కాగా నిబంధనలు విధించడంతో నిర్దేశిత ప్రాంతాల్లోనే దుకాణాలు ఏర్పాటు చేసి, నిర్ణీత వ్యవధిలోనే విక్రయాలు జరపాల్సి వచ్చింది.
ధరలు పెరిగినా కొనుగోళ్ల జోష్..
గత ఏడాదితో పోలిస్తే ఈసారి బాణ సంచా రేట్లు పెరిగాయి. శివకాశిలో అనానుకూల పరిస్థితుల వల్ల ఈసారి డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో ధరల మోతకు ఓ కారణమైంది. బాణసంచా ఉత్పత్తి క్షేత్రమైన శివకాశిలోనే 10 శాతం మేర ధరలు పెరగ్గా, ఇక్కడికి వచ్చాక మరో 20 శాతం లాభం వేసుకొని 30 శాతం మేర ధరల పెరుగుదలను వ్యాపారులు చూపిస్తున్నారు. నగరంలోని 60 మంది హోల్‌సేల్ ట్రేడర్స్ శివకాశి నుంచి సరుకు దిగుమతి చేసుకొని రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తుంటారు. కనీసం 15 రోజుల ముందు నుంచే చిల్లర వ్యాపారులు కొనుగోళ్లు జరిగేవి. కానీ ఈ ఏడాది హోల్‌సేల్ వ్యాపారులు నెల రోజుల ముందే సరుకు తెచ్చినా పోలీసు నిబంధనలతో రిటైల్ కొనుగోళ్లు మాత్రం ప్రారంభించ లేకపోయారు. గత ఏడాది రూ.100 కోట్ల వ్యాపారం జరిగిందని, ఈ ఏడాది రూ.150-200 కోట్లకుపైగా బిజినెస్ జరిగే అవకాశం ఉందని వ్యాపారుల అంచనా.
కొత్త కాంతులివీ..
ఈ ఏడాది దీపావళి వేడుకల్లో కొత్త కాంతులు ఆవిష్కరించేందుకు హోల్‌సేల్ వ్యాపారులు విభిన్నమై వెరైటీస్‌ను మార్కెట్‌కు పరిచయం చేశారు. కొత్త ఉత్పత్తులుగా 25 రకాల రాకెట్లు, చిచ్చుబుడ్లు ఇతర పేలుడు పదార్థాలు మార్కెట్లోకి వచ్చాయని సనత్‌నగర్ క్రాకర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ప్రధానంగా గోల్డెన్ విజిల్, కార్గిల్ బుల్లెట్, గోల్డెన్ డ్రాప్స్, స్టూటింగ్ స్టార్, గోల్డ్ రష్, రెయిన్‌బో, జాక్‌పాట్, చెన్నై బ్యూటీ, కేరళ బ్యూటీ, బుల్లెట్ రెయిన్, గ్రీన్‌పార్క్, పనోరమ, స్నాజీ జిమ్నా, యమ్నీ.. యమ్నీ, జాగ్ బజర్, రా పవర్, నయగరా ఫాల్స్, కిక్ షాట్స్, హాట్ గర్ల్, హాట్ మిర్చి, సిటీ నైట్, 2000 బగ్స్.. ఇలా వివిధ పేర్లతో టపాసులు మార్కెట్‌ను ఏలుతున్నాయి.
చైనా టపాసులపై నిషేధం..
గతంలో దేశీయ టపాసుల కంటే తక్కువ ధరకు లభించే చైనా టపాసులు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపేవారు. కానీ ఈసారి వాటిని విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేయడంతో చైనా సరుకు దిగుమతి చేసుకొన్న పలువురు వ్యాపారులు వాటిని గోదాములకే పరిమితం చేశారు. బాగా తెలిసిన వినియోగదారులు వస్తే తప్ప ఆ సరుకును బయటకు తీయలేదని తెలుస్తోంది. కొందరు హోల్‌సేల్ వ్యాపారులు తమవద్ద ఉన్న చైనా సరుకును రహస్యంగా జిల్లాలకు తరలించి విక్రయించినట్లు వినికిడి.