వెలుగుల కేళి.. దీపావళి | Special Story On Diwali 2020 | Sakshi
Sakshi News home page

వెలుగుల కేళి.. దీపావళి

Published Thu, Nov 12 2020 8:28 AM | Last Updated on Thu, Nov 12 2020 8:28 AM

Special Story On Diwali 2020 - Sakshi

సాక్షి, ఖమ్మం : భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా పండుగలు వెలుగొందుతున్నాయి. జాతి, కుల, మత వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు, అతని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటారు. దీపాల వరుసతో వెలుగొందే గృహాంగణాలు, ఆనందంతో వెల్లువిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల కళకళలు, పిండివంటల ఘుమఘుమలు, బాణసంచా మోతలు ప్రతి ఇంటా కనిపిప్తాయి. ప్రతి ఏటా అశ్వయుజ అమావాస్య రోజున దీపావళి వస్తుంది. ముందు రోజు అశ్వయుజ బహుళ చదుర్దశి. దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఈ ఏడాది తిథులు, నక్షత్రాల ఆధారంగా నరక చతుర్దశిని 13వ తేదీ శుక్రవారం రోజున, దీపావళిని 14వ తేదీన జరుపుకునేందుకు పండితులు నిర్ణయించారు. 

దీపాలంకరణ, లక్ష్మీపూజ
మహిళలంతా బహుళ చతుర్దశి నుంచి కార్తీక మాసం అంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలు. శరదృతువులో వచ్చే ఈ దీపావళి మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలం. ఈ రోజున మహాలక్ష్మి పూజను జరుపుకోవటం ఓ విశిష్టత. దుర్వాస మహర్షి దూవేంద్రుని ఆతిథ్యాన్ని మెచ్చి ఒక హారాన్ని ప్రసాదిస్తాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావంతో తన ఏనుగు మెడలో వేస్తాడు. ఆ హారాన్ని ఏనుగు తొక్కేస్తుంది. దీంతో దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రున్ని శపిస్తాడు. ఆ ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలు పోగొట్టుకుని శ్రీహరిని ప్రార్థిస్తాడు. మహావిష్ణువు గమనించి ఒక జ్యోతిని వెలిగించి దానిని మహాలక్ష్మి రూపంగా తలచి పూజించమని దేవేంద్రునికి సూచిస్తాడు. దీంతో తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపతిగా సర్వ సంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజును సకల సంపన్నులు కావటం కోసం మహాలక్ష్మి పూజలు చేస్తారు.

పేలని టపాసు!
గోదావరిఖని(రామగుండం): టపాసులమోత.. చిచ్చుబుడ్ల వెలుగులు.. రాకెట్ల తారాజువ్వలు.. ఈసారి ఇవ్వన్నీ కన్పించకపోవచ్చు.. కరోనా ఎఫెక్ట్‌.. పెరిగిపోతున్న వాయుకాలుష్యం.. వెరిసి ఈసారి దీపావళి పండుగపై ప్రభావం చూపనున్నాయి. ఏటా పండగకు వారం రోజుల ముందునుంచే టపాసుల మోత విన్పించగా ఈసారి మాత్రం ఆ చప్పుళ్లు కరువయ్యాయి. మరో రెండురోజుల్లో దీపావళి పండుగ ఉండగా టపాసుల మోతపై కరోనా ప్రభావం  తప్పకుండా పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వాయుకాలుష్యాన్ని తగ్గించాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడంతో బాణాసంచా వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతోంది. అసలే చలికాలం జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఊపిరితిత్తులపై పెనుప్రభావం చూపుతున్న కరోనాతో ఇప్పటికే ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు టపాసుల పొగ ఎంతమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో చేతుల్లో డబ్బులు లేకపోగా సుప్రీంకోర్టు తీర్పు కూడా ఈసారి టపాసుల వ్యాపారంపై ప్రభావం చూపనుంది.

శబ్దకాలుష్యంతో ఆరోగ్య సమస్యలు 
శబ్దకాలుష్యం ఆరోగ్యంపై ప్రభావం చూపనుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాయుకాలుష్య నియంత్రణ మండలి సుంప్రీకోర్టును ఆశ్రయించగా, వాయుకాలుష్యాన్ని అదుపులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో హైదరాబాద్‌ లాంటి ప్రధాన నగరాల్లో బాణాసంచా కాల్పివేతపై పోలీసులు ఆంక్షలు విధించారు. భారీ శబ్దాలు వచ్చే టపాసులు పూర్తిగా నిషేధించారు. శబ్దరహిత కాకర్స్‌మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. 

అమ్మకాలపై ప్రభావం..
దీపావళి సమయంలో ఒక్కో కుటుంబం రూ.ఐదు నుంచి రూ.పదివేల విలువచేసే టపాసులు కాల్చేది. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు సైతం రూ.వెయ్యి నుంచి రూ.2వేల విలువచేసే టపాసులు కాల్చడం సాదారణంగా జరిగేది. గతంలో ఉమ్మడి జిల్లాలో బాణాసంచా అమ్మకాలు సుమారు రూ.2కోట్ల వరకు జరిగేవి. కరోనా కారణంగా జనం పండుగలు, ఫంక్షన్లకు భారీ మొత్తంలో ఖర్చుచేసేందుకు ముందుకు రావడం లేదు. ఇప్పుడిప్పుడే పనులు దొరకడంతో వచ్చిన సొమ్మును పొదుపుగా వాడుకోవాలనే ఉద్దేశంతో పండుగలకు ఖర్చులు తగ్గించారు.

పెరిగిన ధరలు.. తగ్గిన విక్రయాలు
విద్యానగర్‌(కరీంనగర్‌): కరోనా తన ప్రతాపాన్ని దీపావళి బాణాసంచాపై కూడా చూపింది. దీపావళి టపాసుల తయారీలో వేసవికాలం కీలకం కాగా ఈసారి వేసవి మొ త్తం లాక్‌డౌన్‌తో టపాసుల తయారీ పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఉత్పత్తి తగ్గి వాటి ధరలు పెరిగాయి. 

మూడింతలు పెరిగిన ధరలు 
కరోనా ప్రభావంతో గత ఏడాదితో పోలీస్తే ఈ సారి టపాసుల ధరలు మూడింతలు పెరిగాయి. లాక్‌డౌన్‌తో అన్ని రంగాలు ఢీలాపడగా, ప్రైవేట్‌ కంపెనీలు, పాఠశాలలు, సంస్ధలు, పరిశ్రమాల్లో పనిచేసేవారు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో వారికి రోజు గడవడమే కష్టంగా ఉన్న పరిస్ధితుల్లో పిల్లలు మారంచేసినా టపాసులు కొనే పరిస్ధితి లేకపోవడంతో వాటి అమ్మకాలు 75శాతం మేర తగ్గిపోయాయి. ప్రస్తుతం కాకరవత్తులు బాక్స్‌ రూ. 80– రూ.250 వరకు, చిచ్చుబుడ్లు బాక్స్‌ రూ.150– రూ.300, రాకెట్స్‌ బాక్స్‌ రూ.125–రూ.550, లక్షి్మబాంబ్స్‌ 5 పీసులు రూ.50– రూ.90, భూచక్రాలు బాక్స్‌ రూ.90–రూ.275 వరకు ధరలు ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement