దగదర్తి పీహెచ్‌సీని ప్రక్షాళన చేస్తాం
-
డీఎంఅండ్‌హెచ్‌వో వరసుందరం
-
డాక్టర్ సహా సిబ్బందికి ఒకరోజు వేతనం నిలిపివేత
దగదర్తి : దగదర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ వరసుందరం అన్నారు. విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం, పీహెచ్‌సీ డాక్టర్ జంషీరా అశ్రద్ధ కారణంగా నిండు గర్భిణణి మృతిచెందడంతోపాటు పీహెచ్‌సీ తీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ వరసుందరం మంగళవార ం ఉదయం 8.50 గంటలకే పీహెచ్‌సీకి చేరుకున్నారు. మందులు బయటే పడేసి ఉండటం గమనించి సిబ్బంది కోసం ఎదురుచూశారు. 9.30 గంటలకు అటెండర్ రాగా, 9.45 గంటలకు స్టాప్ నర్స్, 9.55 ఆయుష్ సిబ్బంది ఒకరు, మెడాల్ సిబ్బంది ఒకరు వచ్చారు. దీంతో రికార్డులు పరిశీలించి డాక్టర్ సహా సిబ్బంది మొత్తానికి ఒకరోజు వేతనాన్ని నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తురిమెర్ల పీహెచ్‌సీ తనిఖీ చేశారు. అక్కడ గైర్హాజరైన సిబ్బందికి కూడా వేతనం నిలిపేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి రోజూ రెండు పీహెచ్‌సీలు తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. విధుల్లో నిర్లక్షం వహించే సిబ్బంది పనితీరుపై కఠిన చర్యలు తప్పవన్నారు. దగదర్తి పీహెచ్‌సీ పరిధిలో గిరిజన గర్భిణి మృతిచెందిన ఘటనలో సిబ్బంది నిర్లక్ష్యాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఏఎన్‌ఎంతోపాటు డాక్టర్‌పై కూడా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఎవరా టీడీపీ నేత..?
నిండు గర్భిణి మృతికి కారణమైన పీహెచ్‌సీ డాక్టర్, సిబ్బందిపై అధికారులు చర్యలు చేపట్టకుండా ఓ టీడీపీ నేత ఎంపీపీ పేరుతో నేరుగా డీఎంఅండ్‌హెచ్‌కి ఫోన్ చేసి డాక్టర్ పనితీరు బాగుందని, పుకార్లు నమ్మొద్దని బతిమాలినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు సదరు టీడీపీ నేతపై మండిపడుతున్నారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్‌పై చర్యలు తీసుకోకుంటే ఊరుకునేది లేదని గిరిజన సంఘాల ప్రతినిధులు, స్థానికులు హెచ్చరిస్తున్నారు.