మొహర్రం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, చిత్రంలో హోంమంత్రి నాయిని, పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సం
సాక్షి, సిటీబ్యూరో: మొహర్రం పండక్కి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం ఆయన మొహర్రం ఏర్పాట్లపై హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగల మాదిరిగా మొహర్రానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు.
మొహర్రం, ఆషూర్ ఖానాల మరమ్మత్తు కోసం ప్రత్యేక నిధుల మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరనున్నట్టు మహమూద్ అలీ తెలిపారు. ఆషూర్ ఖానాల పరిస్థితులపై ప్రత్యేక సర్వే నిర్వహించాలని మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్‌ను ఆయన ఆదేశించారు. మొహర్రం సమయంలో విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, రోడ్లకు మరమ్మత్తు చేపట్టాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు.
మహిళల కోసం ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. హోం మంత్రి నాయిని మాట్లాడుతూ... మొహర్రంను ప్రశాంత వాతావరణలో నిర్వహించుకోవడానికి పోలీసుశాఖ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాలలో అంతరాయం లేకుండా చూడాలని, మెట్రో వాటర్‌వర్క్ ద్వారా నీటి సరఫరా చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో ఎమ్మెల్సీలు సయ్యద్ అమీన్ జాఫ్రీ, అల్తాఫ్ రజ్వి, ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, కిషన్‌రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సందీప్ శాండిల్య, హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ భారతీ హోలీకేరి, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ షైనీ, సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ, అర్కియాలజీ డైరెక్టర్ శ్రీమతి విశాలాక్షితో పాటు జీహెచ్‌ఎంసీ, టీఎస్ ఎస్‌పీడీసీఎల్, ఆర్టీసీ, మెట్రో వాటర్ వర్క్స్, జూపార్క్, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. సిరత్–ఏ–జోహరా కమిటీ అధ్యక్షుడు అలీ రజా, షియా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.