మాట్లాడుతున్న పువ్వాడ నాగేశ్వరరావు
- సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు
ఖమ్మం సిటీ: జిల్లాల పునర్విభజన పేరుతో ఇల్లెందు నియోజకవర్గాన్ని ముక్కలు చేయొద్దని సీపీఐ నేత పువ్వాడ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన బుధవారం ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాల పునర్విభజన ముసాయిదాలో శాస్త్రీయత లోపించిందని, ఆయా ప్రాంతాల చారిత్రక.. సాంస్కతిక అస్థిత్వానికి ముప్పు ఏర్పడిందని అన్నారు. జిల్లాలోని గార్ల, బయ్యారం మండలాలను భౌగోళికాంశాల ఆధారంగా మహబూబాబాద్‌లో కలిపితే ఖమ్మం జిల్లాకు నష్టం కలుగుతుందన్నారు. ఈ రెండు మండలాల్లోని ప్రజలకు జిల్లాతో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలోని ఏడు మండలాలను ఏపీలో కలపడం ద్వారా పెద్ద గాయం చేశారని, ఇప్పుడు మరో రెండింటిని కూడా తొలగిస్తే.. ఆ గాయంపై కారం చల్లినట్టుగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందు నియోజకవర్గాన్ని మూడు ముక్కలుగా చేయకుండా ఖమ్మం లేదా కొత్తగూడెం జిల్లాలో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బయ్యారం మండలంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయని ఇప్పటివరకు గంపెడాశతో ఉన్న ఇక్కడి నిరుద్యోగ యువత.. ప్రభుత్వ నిర్ణయంతో నిరాశ, నిస్పహలో కూరుకుపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వనరులు కోల్పోయిన ఖమ్మం జిల్లా బీదగా మారే ప్రమాదముందన్నారు. ఆగస్టు 15వ తేదీ నాటికి సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లిస్తామన్న మంత్రి తుమ్మల హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయినప్పటికీ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా అదనంగా సాగు నీరు ఇవ్వలేదని విమర్శించారు. ఆర్భాటంగా ప్రకటించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పథకం కింద ఇప్పటివరకూ జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా కట్టలేదని అన్నారు. ఇది మాటల ప్రభుత్వమేనని, చేతులు ఉండవనే విషయానికి ఇది నిదర్శనమని అన్నారు. చేసే పనులను మాత్రమే చెప్పాలని తుమ్మలకు హితవు పలికారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు ఇస్తామని సీఎం కేసీఆర్ గొప్పలు చెబుతున్నారని, వాస్తవానికి తెలంగాణలో అంత సాగు భూమి లేదని రెవెన్యూ సర్వే లెక్కలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. లేని భూమికి నీళ్లెలా ఇస్తారని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, నాయకులు జానిమియా, సలాం, నర్సింహారావు, పోటు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.