వంగలో సస్యరక్షణ పాటించాలి
వంగలో సస్యరక్షణ పాటించాలి
Published Wed, Sep 14 2016 8:21 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
నడిగూడెం : ప్రస్తుతం వాతావరణం చల్లబడుతుండడంతో వంగ పంటకు తెగుళ్లు, పురుగులు ఆశిస్తున్నాయి. నివారణ చర్యలు చేపట్టకపోతే పంట దిగుబడిపై ప్రభావం అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక పంట దిగుబడులు పొందవచ్చని కోదాడ ఉద్యానవన శాఖ అధికారి రవినాయక్ తెలిపారు. పురుగులు, తెగుళ్ల నివారణకు సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే..
ఆశించే పురుగులు.. నివారణ చర్యలు
మొవ్వు, కాయతొలుచు పురుగు
ఈ పురుగు నాటిన 30–40 రోజుల నుంచి ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు ఆశించిన కొమ్మలను తుంచివేయాలి. తొలిదశలో వేప నూనె లీటరు నీటికి 5 మి.లీ లేదా కార్బరిల్ 50 శాతం 3 గ్రాములు, లీటరు నీటికి, లేదా ప్రొఫెనోఫాస్ 2.మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగులు( దీపపు పురుగులు, పేనుబంక, లె ల్లదోమ)
ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి, రసాన్ని పీల్చివేస్తాయి. దీంతో ఆకులు పసుపు రంగులోకి మారి, పైకి ముడుచుకొని ఎండిపోతాయి. వీటి నివారణకు డైమీధోయేట్ లేదా మిథైల్‌డెమటాన్ లేదా ఫిప్రోనిల్ లీటరు నీటికి 2 మి.లీ చొప్పున పిచికారీ చేయాలి.
ఎర్రనల్లి
ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వలన ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలె గూడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోఫాల్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
ఆశించే తెగుళ్లు.. నివారణ చర్యలు
ఆకుమాడు తెగులు
నారును పొలంలో నాటిన తర్వాత 30 రోజులకు ఈ తెగులు ఆశిస్తుంది. ఆకులన్నీ మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపు రంగుకు మారి వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కన్పిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లేదా మాంకోజెబ్ 2.5 గ్రాములు, లేదా కార్బెండిజమ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
ఆకుమాడు, కాయకుళ్లు తెగులు
ఆకులపై అక్కడక్కడ గోధుమ రంగుతో కూడిన మచ్చలు కన్పిస్తాయి. తెగులు ఉధృతమైతే ఆకులు మాడి రాలిపోతాయి. తెగులు సోకిన కాయలు పసుపురంగుకు మారి, కుళ్లిపోతాయి. దీని నివారణకు నారుమడిలో విత్తేముందు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల వీటిలో విత్తనాలను 30 నిమిషాలపాటు నానబెట్టి విత్తుకోవాలి. తెగులు సోకిన పొలంలో పంటమార్పిడి తప్పనిసరిగా పాటించాలి. కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయాలి.
వెర్రి తెగులు
ఆకులు సన్నగా మారి, పాలిపోయిన ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి. మొక్కలు గుబురుగా, చీపురు కట్టలా కనబడతాయి. పూత, కాత లేకుండా మొక్కలు గొడ్డు బారిపోతాయి. ఇది వైరస్ తెగులు. దీని నివారణకు ఆశించిన మొక్కలను తొలగించి, నాశనం చేయాలి. నారుదశలో నాటడానికి ముందు 250 గ్రాములు కార్బోప్యూరాన్ గుళికలను 100 చ.మీ నారుమడికి వేయాలి.
జాగ్రత్తలు..
ప్రధానంగా పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి.
అంతరపంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలను వేసుకోవాలి.
లింగాకర్షక బుట్టలను ఎకరానికి 4 చొప్పున పెట్టాలి.
తలనత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుంచి ఒక అంగుళం కిందికి తుంచి నాశనం చేయాలి.
అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి.
ఎకరానికి 200 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వేయాలి.
Advertisement