- ఆస్పత్రికి హాజరుకాని వైద్యుడి మాటలు
- సకాలంలో వైద్యం అందక వ్యక్తి మృతి
ఈవేళ హాలిడే అని తెలియదా?
Published Sun, Dec 25 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
చింతూరు :
ఏజెన్సీలో సకాలంలో వైద్యసేవలందక పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సేవలందించాల్సిన వైద్యులు అందుబాటులో లేక రోగులతో పాటు కుటుంబ సభ్యులూ నరకయాతన అనుభవిస్తున్నారు. వైద్యుడు లేక సరైన వైద్యం అందక ఓ బడుగుజీవి మరణించిన సంఘటన చింతూరు ఏరియా ఆస్పత్రిలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
మోతుగూడేనికి చెందిన వడ్డి రాజు(40)కు రెండు రోజులుగా ఆయాసం అధికంగా ఉండి, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆదివారం రాత్రి 108లో చింతూరు ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆ సమయంలో వైద్యులు ఎవరూ లేకపోవడంతో, స్టాఫ్ నర్సు, 108 సిబ్బంది అతడిని పరిశీలించి వైద్యుడికి ఫో¯ŒS చేశారు. ఆయాసం అధికంగా ఉండడంతో డాక్టర్ సూచన మేరకు రెండు ఇంజెక్షన్లు చేసినట్టు ఆమె తెలిపింది. కొంతసేపటికి రాజు చలనం లేకుండా పడి ఉండడంతో.. ఏం జరిగిందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. డాక్టర్‌కు ఫో¯ŒS చేస్తే, ఈరోజు పబ్లిక్ హాలిడే అని, అందుకే తాను డ్యూటీలో లేనని చెప్పినట్టు వారు తెలిపారు. ఈ విషయమై నర్సును ప్రశ్నించగా, నాడి కొట్టుకోవడం లేదని, వైద్యులు పరీక్షిస్తేనే కానీ ఏమైనదీ తెలియదని చెప్పినట్టు రాజు భార్య శాంతి, కుమార్తె కుసుమ తెలిపారు. దీనిపై మరోసారి వైద్యుడిని సంప్రదించేందుకు ప్రయత్నించగా, ఆయన ఫో¯ŒS స్విచాఫ్ వచ్చిందని, అయన వస్తేనే కానీ తానేమీ చెప్పలేనని స్టాఫ్ నర్సు స్పష్టం చేసినట్టు వారు తెలిపారు.
నిర్థారించేందుకు రెండు గంటలు
అప్పటికే రాజు మరణించినట్టు పరిస్థితులు చెబుతున్నా, నిర్ధారించలేని పరిస్థితి స్టాఫ్ నర్సుది. మరోవైపు అతను చనిపోయాడని తెలుస్తున్నా వైద్యాధికారి వచ్చి పరీక్షిస్తే ప్రాణం ఉండవచ్చేమోనని కుటుంబ సభ్యుల్లో చిన్న ఆశ. ఇలా రెండు గంటలు గడిచినా వైద్యుడి జాడ లేకపోవడంతో చివరకు వారు కూడా ఆశ వదులుకున్నారు. వైద్యుడు లేడని ముందే చెబితే ప్రైవేటు ఆస్పత్రికైనా తీసుకెళ్లేవారమని, పెద్దాస్పత్రికి వస్తే మంచి వైద్యం అందుతుందనుకుంటే ప్రాణమే పోయిందని కుటుంబ సభ్యులు రోదించారు. రాజు మృతిని నిర్థారించేందుకు వైద్యాధికారి తప్పనిసరి కావడంతో మీడియా సిబ్బంది పీఓ చినబాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ శేషారెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో వారు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంటలో నివసిస్తున్న చింతూరు మండలం తులసిపాక పీహెచ్‌సీ వైద్యాధికారి కోటేశ్వరరావును హుటాహుటిన ఏరియా ఆస్పత్రికి పంపారు. ఆయన రాజును పరీక్షించి, మధుమేహం అధికంగా ఉండడంతో మరణించినట్టు నిర్థారించారు.
రోగుల ఇబ్బందులు
కాగా వైద్యాధికారి మధ్యాహ్నం నుంచి ఆస్పత్రిలో లేకపోవడంతో చాలామంది రోగులు ఇబ్బందులు పడ్డారు. చింతూరు మండలం గూడూరుకు చెందిన ఎనిమిదో తరగతి గిరిజన విద్యార్థి మడివి జోగయ్యకు జ్వరం, వాంతులు, విరేచనాలు అవుతుండడంతో 108లో ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యుడు లేకపోవడంతో స్టాఫ్‌నర్సు వైద్యం అందించినట్టు విద్యార్థి తల్లి తెలిపింది. ఇక్కడి వైద్యుడు తెలంగాణలోని భద్రాచలంలో నివసిస్తూ, అక్కడినుంచే రాకపోకలు సాగిస్తున్నట్టు రోగులు ఆరోపించారు.
Advertisement
Advertisement