కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా వైద్యుల నిరసన
* జిల్లా వ్యాప్తంగా ఆస్పత్రులు మూసివేత
* రోగులకు ఇక్కట్లు
గుంటూరు మెడికల్ : కేంద్ర ప్రభుత్వం వైద్యుల పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ బుధవారం వైద్యులు ఆసుపత్రులు మూసివేసి రోడెక్కి నిరసన తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా బుధవారం సత్యాగ్రహం పేరుతో వైద్యులు ర్యాలీలు నిర్వహించారు. గుంటూరు నగరంలో వైద్యులు ఆసుపత్రులు మూసివేసి గుంటూరు మెడికల్ క్లబ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్ళి తమ డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ర్యాలీకి ముందు మెడికల్ క్లబ్‌లో ఐఎంఏ గుంటూరు నగర శాఖ ఆధ్వర్యంలో రెండు గంటల పాటు సభ నిర్వహించారు. పలువురు వైద్యులు, ఐఎంఏ నాయకులు వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రసంగించారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దును తాము వ్యతిరేకిస్తున్నామని, వైద్యులపై దాడులకు వ్యతిరేకంగా ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అల్లోపతి వైద్యాన్ని కేవలం అల్లోపతి వైద్యులు మాత్రమే చేసేలా ప్రభుత్వం జీవో విడుదల చేయాలని కోరారు. కిందిస్థాయి ఉద్యోగులు, క్లరికల్ ఉద్యోగులు చేసే తప్పిదాలకు వైద్యులను బాధ్యులు చేయకూడదన్నారు. పీసీపీఎన్‌డీటీ యాక్ట్ ద్వారా క్లీనికల్ ఎస్టాబ్లీష్‌మెంట్ యాక్ట్‌లో సవరణలు చేయాలని, కన్జుమర్ ప్రొటెక్షన్ యాక్ట్‌లో సవరణలు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ గుంటూరు నగర అధ్యక్షుడు డాక్టర్ ఈద కృష్ణమూర్తి, సెక్రటరీ డాక్టర్ ఆవుల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యార్లగడ్డ సుబ్బరాయుడు, సీనియర్ వైద్యనిపుణులు డాక్టర్ నాగళ్ళ కిషోర్, డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, డాక్టర్ అలపర్తి లక్ష్మయ్య, డాక్టర్ చక్కా శివరామకృష్ణ, డాక్టర్ బదిరి నారాయణ, డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావు, ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్ ఇంజేటి బాబ్జిశ్యామ్‌కుమార్, గుంటూరు శాఖ సెక్రటరీ డాక్టర్ డి.ఎస్.ఎస్.శ్రీనివాస్‌ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
మూతపడ్డ ఆసుపత్రులు..
గుంటూరు నగరంలో పలు ఆసుపత్రులు సత్యాగ్రహంలో భాగంగా మూతపడ్డాయి. పెద్ద నోట్ల రద్దుతో వారం రోజులుగా సాధారణవైద్య సేవల కోసం ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న రోగులు బుధవారం ఆసుపత్రుల సమ్మెతో మరింత ఇబ్బంది పడ్డారు. అధిక సంఖ్యలో వైద్యులు, మెడికల్ క్లబ్‌కు చేరుకుని తమ నిరసన తెలియజేశారు. అత్యవసర వైద్య సేవలకు మాత్రం ఇబ్బంది లేకుండా కొందరు వైద్యులు ఆసుపత్రిలో ఉండి రోగులకు సేవలు అందించారు. గుంటూరునగరంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా ఐఎంఏ ఆధ్వర్యంలో సత్యాగ్రహంలో భాగంగా ఆసుపత్రులు మూసివేశారు.