పోలవరం పేరుతో దోచేస్తున్నారు
పోలవరం పేరుతో దోచేస్తున్నారు
Published Mon, Jan 30 2017 12:20 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM
చింతలపూడి ఎత్తిపోతల రైతులను అన్యాయం
విద్యార్థినులనూ వదలడం లేదు
ఎమ్మార్వోను జుట్టుపట్టుకు ఈడ్చేసినా దిక్కులేదు
చంద్రబాబుపై జగన్ ధ్వజం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ పేరుతో దోచేస్తున్నారని.. బినామీలను సబ్ కాంట్రాక్టర్లుగా పెట్టి కమీషన్లు తీసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడి అవినీతి, అసత్య, అప్రజాస్వామిక, అసమర్థ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రాజెక్టుల పేరుతో అవినీతిని పారిస్తున్నారని విమర్శించారు. జిల్లాకు సంబంధించిన అంశాలను వైఎస్ జగన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.46 వేల కోట్లకు పెంచారని, కాంట్రాక్టర్ సరిగా పనిచేయడం లేదని తెలిసినా.. అతన్ని మార్చి కొత్తగా మళ్లీ టెండరు పిలవాల్సి ఉన్నా పిలవలేదని ధ్వజమెత్తారు. కొత్తగా టెండర్లు పిలిస్తే అంచనాలు తగ్గుతాయని, అందుకే కొత్తగా టెండరు పిలవకుండా అదే కాంట్రాక్టర్‌ను కొనసాగిస్తూ బినామీలను సబ్ కాంట్రాక్టర్లుగా తీసుకొస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం కుడి కాలువ 170 కిలోమీటర్ల పనుల్లో దాదాపు 140 కిలోమీటర్ల మేర పూర్తయ్యిందని, మిగిలింది 30 కిలోమీటర్లు మాత్రమేనని అన్నారు. వైఎస్ హయాంలో 80 శాతం పనులు పూర్తవగా, చంద్రబాబునాయుడు పట్టిసీమ వద్ద పంపులు పెట్టి లస్కర్ తరహాలో గేట్లు ఎత్తి కృష్ణా, గోదావరిలను అనుసంధానం చేశానని గొప్పలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ఇదే జిల్లా ప్రజాప్రతినిధి ఒక మహిళా ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని నడిరోడ్డు మీదకు లాక్కొచ్చినా పట్టించుకోలేదన్నారు. శ్రీగౌతమి అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ వివాదం వెనుక తెలుగుదేశం నేత ఉన్నాడని.. ఆయనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని బాధితులే ఆరోపించినా, పత్రికల్లో వచ్చినా చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేవన్నారు. చింతలపూడి ప్రాజెక్ట్ విషయంలో రైతులకు అన్యాయం చేస్తున్నారని.. ఒకే ప్రాజెక్టు పరిధిలో ఒక్కో గ్రామంలో ఒక్కో రేటు ఇస్తూ గిరిజనులను మోసం చేస్తున్నారని అన్నారు. గ్రామాల మద్య తగాదాలు పెట్టేలా చంద్రబాబు పనితీరు ఉందని విమర్శించారు.
Advertisement
Advertisement