రక్షణ గోదారమ్మకెరుక
-
ధవళేశ్వరం బ్యారేజి దుస్థితి
-
169 గేట్లలో రూ.16.90 లక్షల విలుౖÐð న బ్రేక్ కాయిల్స్ చోరీ
-
నామమాత్రంగా చర్యలు.. తేలని దోషులు
-
అరకొరగా రక్షణ ఏర్పాట్లు 8 చాలీచాలని సిబ్బందితోనే కాలక్షేపం
-
‘సాక్షి’ పరిశీలన
ఉభయ గోదావరి జిల్లాల వరప్రదాయినిగా నిలుస్తున్న ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. దేశంలోనే అత్యధికంగా 175 గేట్లతో నిర్మించిన ఈ బ్యారేజి పరిరక్షణలో జలవనరుల శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. వరదల సమయంలో బ్యారేజి గేట్లను ఎత్తేందుకు ఉపయోగించే ఎంతో విలువైన బ్రేక్ కాయిల్స్ మాయమయ్యాయి. మరోపక్క చాలీచాలని సిబ్బందితోనే బ్యారేజి నిర్వహణ, రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈ అంశాలపై ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో నివ్వెరపరిచే నిజాలు వెలుగు చూశాయి.
సాక్షి, రాజమహేంద్రవరం :
ఉభయ గోదావరి జిల్లాల్లో ఏటా సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరందించే ధవళేశ్వరం బ్యారేజి రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. సుమారు రెండు నెలల కిందట జరిగిన బ్రేక్ కాయిల్స్ చోరీ ఘటనతో బ్యారేజి రక్షణలోని డొల్లతనం స్పష్టంగా బయటపడింది. గోదావరి నదికి సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ ఎక్కువగా వరదలు వస్తూంటాయి. ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతినిబట్టి వెనువెంటనే బ్యారేజి క్రస్ట్ గేట్లను అవసరమైన మేరకు ఎత్తి.. అదనపు జలాలను సముద్రంలోకి విడిచిపెడతారు. నాలుగు ఆర్‌్మలుగా నిర్మించిన కాటన్ బ్యారేజికి 175 గేట్లు ఉన్నాయి. టన్నులకొద్దీ బరువుండే ఈ ఇనుప గేట్లను సకాలంలో ఎత్తేందుకు బ్రేక్ కాయిల్స్ ఉపయోగిస్తారు. వరద నీటి నియంత్రణలో ఎంతో కీలకంగా ఉపయోగించే ఈ కాయిల్స్ చోరీకి గురయ్యాయి. అది కూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా 169 గేట్లకు ఉండే బ్రేక్ కాయిల్స్ మాయమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.16.90 లక్షలని చెబుతున్నారు. ప్రస్తుతం వరదల సీజనే అయినప్పటికీ వీటిని ఇంతవరకూ తిరిగి ఏర్పాటు చేయలేదు.
మరోపక్క ఇంత ముఖ్యమైన, విలువైన పరికరాలు చోరీకి గురవుతూంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారన్న ప్రశ్న. పుణేలో మాత్రమే దొరికే ఈ కాయిల్స్ రప్పించాలని భావించినా ఇప్పటికిప్పుడు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టి వీటిని తయారు చేయించుకోవాలని చెబుతున్నారు. మరోపక్క కాయిల్స్ ఉన్నప్పుడు కేవలం స్విచ్ ఆన్ చేయగానే గేట్లు వాటంతటవే తెరచుకునేవి. ఇప్పుడవి దొంగలపాలు కావడంతో ఒక్కో గేటుకు ఇద్దరు అదనపు సిబ్బందిని నియమించడం తప్పనిసరైంది.
మొక్కుబడి చర్యలతో సరి
బ్యారేజి నిర్వహణలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పరికరాలు చోరీకి గురయితే అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకున్నారు. ముగ్గురు సెక్షన్ అధికారులను సస్పెండ్ చేసి, చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన సమయంలోని ఉన్నతాధికారులందరూ బదిలీపై వెళ్లిపోయారు. ప్రస్తుతం కొత్తవారు రావడంతో శాఖాపరమైన విచారణ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి.
240 మందికి.. 40 మందే సిబ్బంది
బ్యారేజి నిర్వహణ, రక్షణ కోసం 240 మంది సిబ్బంది అవసరమవుతారు. కానీ ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారంటే బ్యారేజి రక్షణ, నిర్వహణలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతుంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద కాపలాగా ప్రైవేటు వ్యక్తులను నియమించారు. మూడు షిఫ్టుల్లో ఒక్కో ఆర్మ్ వద్ద ఆరుగురు చొప్పున నాలుగు ఆర్మ్‌ల వద్ద 24 మందిని నియమించారు. అయితే రాత్రిపూట విధులు నిర్వర్తించేవారికి కనీసం టార్చిలైట్‌ను కూడా అధికారులు సమకూర్చలేదు. ధవళేశ్వరంవైపు బ్యారేజి పైకి, జలాల కొలత చూసే ప్రాంతంలోకి ఇతరులు రాకుండా ఉండేలా ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. ఉభయ గోదావరి జిల్లాలకు ఎంతో కీలకమైన ప్రభుత్వం, జలవనరుల శాఖ పటిష్ట చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది.
పోలీసులు పట్టించుకోవడంలేదు
బ్రేక్ కాయిల్స్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ ఎంతవరకూ వచ్చిందో తెలియదు. ప్రస్తుతం గేట్లు తెరవడానికి ఇద్దరు వ్యక్తులు అవసరమవుతున్నారు. బ్రేక్ కాయిల్స్‌కు ఆర్డర్ పెట్టాం. వీటిని పుణేలో తయారు చేస్తారు. రెండు నెలలు పడుతుందన్నారు. అన్నీ ఒక్కసారిగా కాకపోయినా విడతలవారీగానైనా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం బ్యారేజి రక్షణగా బయటి వ్యక్తులను నియమించాం. మరో 20 రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. రాత్రి వేళ బ్యారేజిపై కాపలా ఉంచాలని పోలీసు శాఖను కోరాం.
– కృష్ణారావు, ఈఈ, హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం బ్యారేజి