ఆందోళన వద్దు
ఆందోళన వద్దు
Published Wed, Nov 9 2016 9:08 PM | Last Updated on Mon, Sep 4 2017 7:39 PM
– జిల్లా ప్రజలకు ఎస్పీ భరోసా
– నగరంలో మోటర్ బైక్‌పై విస్తృత పర్యటన
– బ్యాంకు ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం
కర్నూలు : జిల్లా ప్రజలు రూ.500, రూ.1000 నోట్ల గురించి ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని ఎస్పీ ఆకే రవికృష్ణ భరోసా ఇచ్చారు. గురువారం నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పెద్ద నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చునని, శని, ఆదివారాల్లో కూడా బ్యాంకులు పనిచేస్తాయని స్పష్టం చేశారు. డీజీపీ ఆదేశాల మేరకు ఎస్పీ స్వయంగా ద్విచక్ర వాహనంపై నగరంలో పర్యటించారు. జిల్లాపరిషత్ ఎదురుగా ఉన్న ఎమ్‌జీ పెట్రోల్ బంకుకు వెళ్లి ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమీపంలోని ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి అక్కడ మేనేజర్‌తో మాట్లాడారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నగరంలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎక్కడైనా సమస్యలు తలెత్తితే డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. గురువారం నుంచి ఏటీఎం మిషన్లలో డిపాజిట్ చేసేవారు రోజుకు రూ.49,900 వరకు జమ చేసుకోవచ్చునని, బ్యాంకులకు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఒరిజినల్స్, జిరాక్స్‌లతో వెళ్లి నగదు ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చని బ్యాంకర్లు స్పష్టం చేశారు.
ఎస్పీ సూచనలు...
డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున.. క్యూలైన్లు ఏర్పాటు చేసుకోవాలని, టోకన్ సిస్టమ్ పాటించే విధంగా చూడాలన్నారు. ప్రతి బ్యాంకు వద్ద గురువారం నుంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, జనసమూహం ఎక్కువగా ఉండే బ్యాంకుల వద్ద టెంట్లు వేసి వారికి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాంకు వేళలు ఉదయం నుంచే ప్రారంభించాలని కోరారు. మండలాలు, గ్రామాల్లో ఉండే రైతులు, ఇతర ప్రజలు.. ప్రధానమంత్రి జనధన్ యోజన అకౌంట్‌లో జమ చేసుకోవచ్చునన్నారు. 2017 మార్చి 31 వరకు ఆర్‌బీఐ కార్యాలయాల్లో కూడా డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉందని సూచించారు. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో రోజుకు రూ.4 వేలు మాత్రమే మార్పు చేసుకోవచ్చునన్నారు. బ్యాంకులలోని సీడీఎం, ఏటీఎం మిషన్‌లో కూడా రూ.500, రూ.1000 నగదును రూ.49,900 వరకు డిపాజిట్ చేసుకోవచ్చునని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని బ్యాంకర్లు కోరగా అందుకు ఎస్పీ సమ్మతించారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మురళీధర్, చీఫ్ మేనేజర్ బాలమురళీకృష్ణ, సీఐలు డేగల ప్రభాకర్, కృష్ణయ్య, మహేశ్వరరెడ్డి, నాగరాజరావు, మధుసూదన్‌రావు, నాగరాజు యాదవ్, ఎస్‌ఐలు, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు.
Advertisement