డోంట్‌వర్రీ...ఇన్వెర్టర్ రెడీ
-
తక్షణ విద్యుత్‌కు చక్కని పరిష్కారం
-
నగరంలో పెరుగుతున్న ఇన్వర్టర్ల వాడకం
-
ఏడాదికి రూ.నాలుగు కోట్ల వ్యాపారం
పాతపోస్టాఫీసు : బయట నిప్పులు కక్కుతున్న సూరీడు. ఇంట్లో ఫ్యాన్ వేసుకుందామంటే పవర్ కట్. పొద్దంతా ఎండ వేడిలో కష్టపడి ఇంటికి చేరుకున్న సగటు వ్యక్తికి కాస్త ఉపశమనం పొందే అవకాశం కనిపించడం లేదు. అర్ధరాత్రి కరెంటు పోయిందా ఇక అంతే సంగతులు. ఇంట్లో చంటిబిడ్డలు ఉంటే ఆ బాధ చెప్పలేనివి కావు. కరెంటు కష్టాల నుంచి గట్టెక్కడానికి సామాన్యులు సైతం ఇన్వర్టర్లను ఆశ్రయిస్తున్నారు. ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే పరిమితం అయిన ఇన్వర్టర్లు ఇపుడు మధ్యతరగతికి కూడా అందుబాటులోకి వచ్చింది. ఇళ్లకే కాదు కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు, ఆసుపత్రులు, దుకాణాలు ఇలా ఒకటేమిటి అన్ని చోట్ల ఇన్వర్టర్ల వాడకం పెరిగింది.
అత్యాధునిక టెక్నాలజీ
ప్రస్తుతం మార్కెట్లో లభ్యం అవుతున్న ఇన్వర్టర్లు అత్యాధునిక సైన్‌వేవ్ టెక్నాలజీతో తయారైనవి లభిస్తున్నాయి. ఈ పరిజ్ఞానం వల్ల గృహోపకరణాలకు నూరు శాతం కచ్చితమైన విద్యుత్ సరఫరాను అందిస్తాయి. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాధారణ విద్యుత్ మాదిరిగానే వేవ్స్ రూపంలో విద్యుత్‌ను సరఫరా చేయడం వల్ల గృ హోపకరణాలు ఎక్కువ కాలం మన్నుతాయి. వేవ్ టెక్నాలజీ బ్యాటరీలోని నీటి ప్రవాహాన్ని నియంత్రించి ఇన్వర్టర్లలో కీలకమైన బ్యాటరీ జీవితాకాలాన్ని పెంచుతుంది. సాధారణ ఇన్వర్టర్లతో పోల్చితే సైన్‌వేవ్ టెక్నాలజీ ఇన్వర్టర్లు 50 శాతం విద్యుత్‌ను ఆదా చేస్తాయి. ఓవర్‌లోడ్ నుంచి రక్షణ కల్పిస్తాయి.
ఇన్వర్టర్ల జీవిత కాలం బాగుండాలంటే
-
నాలుగు నుంచి ఆరు నెలలకు ఒకసారి బ్యాటరీలోని డిస్టిల్ వాటర్ లెవెల్ తనిఖీ చేయించాలి. నిర్వహణ తక్కువగా ఉన్న బ్యాటరీకైనా తనిఖీ తప్పనిసరి
-
నాలుగు నుంచి ఆరు నెలలకు ఒకసారి బ్యాటరీ నుంచి ఇన్వర్టర్ల టెర్మినల్స్ వద్ద పెట్రోలియం జెల్లీ పూయాలి
-
లో బ్యాటరీ ఇండికేటర్ వెలిగినపుడు ఇన్వర్టర్ వాడకుండా, ఛార్జింగ్‌లో ఉంచి గ్రీన్ ఇండికేటర్ వచ్చిన తరువాతనే వాడాలి. లేకుంటే కాలిపోతుంది.
-
ఇన్వర్టర్లతో వచ్చిన కంపెనీ మాన్యువల్‌ను ఎప్పటికప్పుడు అనుసరిస్తే బ్యాటరీ, ఇన్‌వర్టర్ల జీవితకాలం పెరుగుతుంది.
అవసరాలకు తగిన విధంగా
-
ఒక ట్యూబ్‌లైట్, ఫ్యాన్ పనిచేయాలంటే 250 వీఏ ఇన్వర్టు అవసరం అవుతుంది. దీనికి 60 ఏహెచ్ బ్యాటరీ అనుసంధానించబడుతుంది. మూడు గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. దీని ధర సుమారుగా రూ.6 వేల వరకూ ఉంది
-
రెండు ట్యూబ్‌లైట్లు, రెండు ఫ్యాన్లు పనిచేయాలంటే 400 వీఏ ఇన్వర్టర్ అవసరం. దీనికి 100 ఏహెచ్ బ్యాటరీ అమర్చుతారు. సుమారు రెండు గంటల పాటు పనిచేస్తుంది. ధర రూ.10 వేలు
-
మూడు ట్యూబ్‌లైట్లు, మూడు ఫ్యాన్లు ఒక టీవీ పనిచేయాలంటే 650 వీఏ ఇన్వర్టర్ అవసరం అవుతుంది. దీనికి 100, 135, 150 ఏహెచ్ కెపాసిటీ గల ఏ బ్యాటరీ అయినా అమర్చుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీని బట్టి రూ.11 వేల నుంచి రూ.18 వేల వరకూ ఉంది. రెండు నుంచి నాలుగు గంటల సేపు నిర్విరామంగా పనిచేస్తుంది.
-
నాలుగు ట్యూబ్‌లైట్లు, 4 ఫ్యాన్లు, ఒక టీవీ పనిచేయాలంటే 850 వీఏ ఇన్వర్టర్ అవసరం. 100 నుంచి 150 ఏహెచ్ కెపాసిటీ గల ఏ బ్యాటరీ అయినా వాడవచ్చు. కెపాసిటీని బట్టి దీని ధర రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకూ ఉంది. రెండు నుంచి నాలుగు గంటలసేపు పనిచేస్తుంది.
-
లక్ష రూపాయల పెట్టుబడితో 1.5టన్ను ఏసీతో పాటు 5 ట్యూబ్‌లైట్లు,5 ఫ్యాన్లు కూడా పనిచేయించవచ్చు.
సోలార్ ఇన్వర్టర్లను వినియోగించాలంటే ముందుగా వాటిని ఛార్జిచేయడానికి విద్యుత్‌ను ఉపయోగించాలి. దానివల్ల విద్యుత్ వినియోగంలో తేడా పెద్దగా కనిపించదు. ఎక్కువ సమయం విద్యుత్‌కు అంతరాయం ఏర్పడితే బ్యాటరీలు రీఛార్జ్ కావడం కష్టమే. దీనికి విరుగుడుగా సోలార్ ఇన్వర్టర్లు మార్కెట్లో లభ్యం అవుతున్నాయి. మామూలు వాటితో పోల్చితే ఖరీదు అధికంగానే ఉన్నా జీవితకాలం పాటు ఇబ్బందులు లేకుండా వినియోగించుకోవచ్చు. పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశమే లేని సోలార్ ఇన్వర్టర్ల వినియోగానికి ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది.
అమ్మకాలు ఇలా...
పవర్‌కట్ అధికంగా ఉన్న రోజుల్లో ఏడాదికి నగర వ్యాప్తంగా ఐదు నుంచి ఏడు కోట్ల వరకూ అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం పవర్ కట్ తక్కువగా ఉన్నా ఏడాదికి సుమారుగా మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. పాత వినియోగదారులు తమవద్దనున్న పాత ఇన్వర్టర్లను రిప్లేస్‌మెంట్ చేయించుకుని ఉపయోగించుకొంటున్నారు. లోకల్‌మేడ్ ఇన్వర్టర్ల కంటే బ్రాండెడ్ ఇన్వర్టర్స్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు.