డబుల్.. అంతా లోకల్..
♦ ఇళ్ల నిర్మాణంలో స్థానికతకే ప్రాధాన్యత ఇవ్వాలి
♦ యూనిట్‌గా తీసుకుంటేనే లబ్ధిదారులకు ప్రయోజనం
♦ ప్రతి గ్రామంలో స్థలం గుర్తించి నిర్మాణాలు మొదలు పెట్టాలి
♦ జెడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో సభ్యుల సూచన
♦ ఇళ్ల నిర్మాణంలో స్థానికతకే ప్రాధాన్యం ఇవ్వాలి
♦ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుంటేనే లబ్ధిదారులకు ప్రయోజనం
♦ జెడ్పీ స్థాయీసంఘం సమావేశాల్లో సభ్యుల సూచన
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పథకాన్ని విజయవంతం చేయడంలో అధికారులు క్రియాశీలంగా వ్యవహరించాలని జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. ఈ పథకం కింద నిర్మించే ఇళ్లను గ్రామాల వారీగా స్థలాలు గుర్తించి ఆ గ్రామానికి చెందిన వారికే ఇవ్వాలన్నారు. దీంతో లక్ష్యం నెరవేరుతుందని, అలా కాకుండా ఊరి పొలిమేరలో.. రెండు, మూడు గ్రామాలకు ఒక చోట స్థలాన్ని గుర్తించి ఇళ్లను నిర్మిస్తే ప్రయోజనం ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు. బుధవారం జిల్లా పరిషత్‌లో జరిగిన జెడ్పీ స్థాయి సంఘ సమావేశాల్లో ఆమె పాల్గొన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, మహిళ, శిశు సంక్షేమ స్థాయి సంఘ సమావేశాల్లో ఆయా శాఖలకు సంబంధించి పురోగతిని సమీక్షించారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి స్థలాల ఎంపిక ప్రక్రియలో జాగ్రత్త వహిస్తే సమస్యలుండవని ఆమె స్పష్టం చేశారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాల సభ్యులకు కుటీర పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించాలని, మేకిన్ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల ఏర్పాటుకు ఇచ్చే రాయితీలను వివరించి ఆ రంగంవైపు దృష్టి మళ్లించాలని సూచించారు. నీటి వృథాను అరికట్టి ప్రతి గృహంలో ఇంకుడు గుంతను విధిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. తెలంగాణ హరితహారం కింద ఈత మొక్కలను నాటేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు సంతృప్తికరంగా లేవని చైర్‌పర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణీలకు ప్రత్యేక పరిస్థితుల్లోనే సిజేరియన్ చేయాలని.. అవసరం లేకున్నా కోత కాన్పులు చేయొద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో పరిగి శాసనసభ్యులు టి.రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.