ఐదు తారలపై అనుమానం | DOUBTS ON FIVE STAR RATED PUMP SETS | Sakshi
Sakshi News home page

ఐదు తారలపై అనుమానం

Published Sat, May 20 2017 12:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ఐదు తారలపై అనుమానం - Sakshi

ఐదు తారలపై అనుమానం

ఏలూరు (ఆర్‌ఆర్‌ పేట) : విద్యుత్‌ ఆదా పేరిట మెట్టప్రాంత రైతులకు ఐదు తారల (ఫైవ్‌స్టార్‌ రేటెడ్‌) పంపుసెట్లు ఇచ్చేందుకు విద్యుత్‌ శాఖ సన్నద్ధమైంది. పాత పంపుసెట్ల స్థానంలో వీటిని ఉచితంగా పంపిణీ చేస్తామని చెబుతోంది. దీనిపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్‌ బిల్లుల మోత మోగించేందుకే వీటిని పంపిణీ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌) తూర్పుగోదావరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా రైతులకు ఫైవ్‌ స్టార్‌ రేటెడ్‌ పంపుసెట్లు పంపిణీ చేసింది. అక్కడ సత్ఫలితాలు వచ్చాయని.. డిస్కం పరిధిలోని 5 జిల్లాల రైతుల పొలాల్లో వీటిని ఉచితంగా బిగించడం ద్వారా గణనీయంగా విద్యుత్‌ మిగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలకు 35 వేల ఫైవ్‌స్టార్‌ రేటెడ్‌ పంపుసెట్లను మంజూరు చేసింది. వీటిలో ఉభయ గోదావరి జిల్లాలకు 10 వేల చొప్పున పంపుసెట్లను కేటాయించింది. గతంలో జిల్లాలో ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేసిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) ద్వారా వీటిని బిగించనున్నారు.
 
సబ్‌మెర్సిబుల్‌ పంపులకే..
తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ బిగించనున్న కొత్త పంపుసెట్లు కేవలం ప్రస్తుతం వినియోగిస్తున్న సబ్‌మెర్సిబుల్‌ పంపుసెట్లలో 5 హెచ్‌పీ సామర్థ్యం ఉన్నవాటికి మాత్రమే. నిబంధనల మేరకు మోనో బ్లాక్‌ మోటార్లు వినియోగిస్తున్న రైతులకు స్టార్‌ రేటెడ్‌ మోటార్లు బిగించే అవకాశం లేదు. సబ్‌మెర్సిబుల్‌ పంపుసెట్‌లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారు చేసిన ఇంపెల్లర్లు వాడటం వల్ల పంపు సెట్‌ ఎక్కువ కాలం మన్నుతుంది. కొత్త పంపుసెట్‌ ద్వారా ఇప్పటికి వస్తున్న స్థాయి కన్నా అధిక మొత్తంలో లేదా అంతే మొత్తంలో నీరు విడుదలయ్యే అవకాశముంది. రైతులు తమ మొబైల్‌ ఫోన్‌లోని ఓ మొబైల్‌ యాప్‌ ద్వారా ఏ సమయంలోనైనా మోటార్‌ను ఆన్‌, ఆఫ్‌ చేసుకోవచ్చు, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ పంపు సెట్‌ వినియోగించడం వల్ల ట్రాన్స్‌ ఫార్మర్‌పై లోడ్‌ తగ్గి విద్యుత్‌ సమస్యలు ఉండవు. ఈ పంపుసెట్లకు ఐదేళ్లపాటు ఉచితంగా మరమ్మతులు, నిర్వహణ సదుపాయం ఉంది. రక్షణతో కూడిన కంట్రోల్‌ ప్యానల్‌లో కెపాసిటర్, డిజిటల్‌ మీటర్లను కూడా ఉచితంగా బిగిస్తారు. ఈ పంపుసెట్లు నడవడానికి తక్కువ విద్యుత్‌ సరిపోతుందని, తద్వారా విద్యుత్‌ ఆదా ఆవుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
 
అనుమానాలు అనేకం
స్టార్‌ రేటెడ్‌ పంపుసెట్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో రికార్డుల ప్రకారం 5 హెచ్‌పీ మోటార్లు వినియోగిస్తున్న రైతుల్లో అధిక శాతం మంది జంగారెడ్డి గూడెం డివిజన్‌లో ఉన్నారు. ఆ తరువాత స్థానం నిడదవోలు డివిజన్‌ది.ఈ రెండు డివిజన్లలో భూగర్భ నీటిమట్టం అడుగంటిపోతున్న స్థితిలో ఈ మోటార్లు వినియోగించడానికి రైతులు ఆసక్తి చూపుతారో లేదోననే అనుమానాలున్నాయి. గోదావరి నది పరీవాహక ప్రాంతం మినహా అన్నిప్రాంతాల్లో సుమారు 180 నుంచి 220 అడుగుల లోతున భూగర్భ జలాలు ఉన్నాయి. 5 హెచ్‌పీ మోటార్లకు 150 నుంచి 180 అడుగుల లోతు నుంచి మాత్రమే నీటిని తోడే సామర్థ్యం ఉంది. 5 హెచ్‌పీ సామర్థ్యం దాటి వినియోగిస్తూ విద్యుత్‌ చార్జీల మోత మోగుతాయనే ఆందోళన రైతుల్లో ఉంది. దీనికితోడు కొత్త పంపుసెట్లు బిగించిన అనంతరం పాత పంపు సెట్లను ఈఈఎస్‌ఎల్‌ తీసుకెళ్లిపోతుంది. దీనివల్ల కొత్త పంపుసెట్లు తీసుకునేందుకు రైతులు అంగీకరిస్తారా లేదా అనేది అనుమానంగానే ఉంది.
 
రైతులు అంగీకరిస్తేనే బిగిస్తాం
జిల్లాకు మంజూరైన ఫైవ్‌స్టార్‌ రేటెడ్‌ పంపుసెట్లను రైతుల అంగీకారం మేరకే బిగించడానికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికోసం ఇప్పటికే సర్వే చేసి రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరిస్తున్నాం. చాలామంది రైతులు 5 హెచ్‌పీ మోటార్లు వినియోగిస్తున్నట్టు చెప్పినప్పటికీ.. మరింత ఎక్కువ హెచ్‌పీ మోటార్లు వినియోగిస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. అదనపు హెచ్‌పీ మోటార్లు వినియోగిస్తున్నట్టు తెలిస్తే అదనంగా వినియోగిస్తున్న సామర్థ్యం మేరకు ఒక్కో హెచ్‌పీకి రూ.1,200 చొప్పున రైతుల నుంచి వసూలు చేసి వారిని అధిక సామర్థ్య వినియోగదారుల జాబితాలో చేర్చి రెగ్యులరైజ్‌ చేస్తాం.
– సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఈ, ఈపీడీసీఎల్‌
 
 డివిజన్ల వారీగా కేటాయింపులు ఇలా
జిల్లాకు మంజూరైన 10 వేల ఫైవ్‌స్టార్‌ రేటెడ్‌ పంపుసెట్లను వివిధ డివిజన్లకు ఇలా కేటాయించారు. 
డివిజన్‌ ప్రస్తుతమున్న కేటాయించిన 
5 హెచ్‌పీ మోటార్లు కొత్త పంపుసెట్లు
ఏలూరు 4,339 1,761
నిడదవోలు 7,938 3,221 
భీమవరం 392 159 
తాడేపల్లిగూడెం 1,031 419 
జంగారెడ్డిగూడెం 10,941 4,440 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement