సమస్యల 'తాండ'వం
మెదక్‌రూరల్ : గిరిజన తండాలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయి. తాగునీరు దొరకక...వీధిలైట్లు వెలగక...రోడ్లు సరిగాలేక గిరిజన ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకాదు. మెదక్ మండలం అవుసులపల్లి సమీపంలో ఓ గిరిజన తండా ఉంది. తండాలో సుమారు 20 నివాస గృహాలు ఉన్నాయి, ఎక్కువ శాతం పూరి గుడిసెలే ఇక్కడ కనిపిస్తాయి. పట్టణానికి 4కిలో మీటర్ల దూరంలో మెదక్-రామాయంపేట ప్రధాన రోడ్డు పక్కనే ఉన్న ఈ గిరిజన తండా అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉంది.
తండాలో సీసీ రోడ్లు మచ్చుకైనా కనిపించవు. ఇటివల కురిసిన చిలకరి జల్లులకే రోడ్డంతా బురదమయంగా మారి నడవలేని స్థితికి చేరింది. వీధిలైట్లు అమర్చినప్పటికీ అవి నెలరోజులుగా వెలగక పోవడంతో గిరిజనులు అంధకారంలో మగ్గుతున్నారు. తండాలో తాగునీటి సమస్య ఘోరంగా ఉంది. రెండు మినీ ట్యాంకులున్నప్పటికీ ఇందుకు సంబంధించిన బోరుబావుల్లో చుక్కనీరు లేదు. దీంతో బోరుబావిలోని మోటార్‌ను గ్రామ సర్పంచ్ రెండు నెలల క్రితం తీసుకెళ్లగా, స్ట్రాటర్ బోర్డును వార్డు సభ్యుడు తీసుకెళ్లాడని గిరిజనులు తెలిపారు.
అప్పటి నుంచి తండాలోకి వాటర్ ట్యాంకర్‌ను కూడా పంపించడం లేదని గిరిజనులు వాపోయారు. వ్యవసాయ పొలాల్లోకి వెళ్లి నానా పాట్లు పడుతూ బోర్ల వద్దనుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నామని వాపోయారు. ఈ క్రమంలో తాగునీటి కోసం వ్యవసాయ పొలాల్లోకి వెళ్లగా కిందపడటంతో తండాలోని ఓ వృద్ధురాలి చేయి విరిగింది. తండాకు ఆనుకొని ప్రధాన రోడ్డు ఉన్నప్పటికీ ఒక్క బస్సుకూడా ఆపరు. దీంతో ప్రైవేట్ వాహనాలే దిక్కు. తండాలోని పిల్లలు చదువుల కోసం మెదక్ పట్టణానికి వెళ్లాలంటే పడరాని పాట్లు పడాల్సిందే..
చీకట్లో మగ్గుతున్నాం..
తండాలో వీధిలైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వెళ్తే ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురికావాల్సి వస్తోంది.
- లక్ష్మి, అవుసులపల్లి తండా
తాగునీటి కోసం పోతే చేయి విరిగింది
తండాలో బోర్లు వస్తలేవు. ట్యాంకర్లు కూడా పంపిస్తలేరు. వ్యవసాయ పొలాల్లోకి తాగునీళ్లు తెచ్చుకుంటున్నాం. తాగునీళ్లకోసం పొలాల్లోకి ఒడ్డుమీదకెళ్లి పడ్డా.. దాంతో చేయి విరిగింది.
- తోతి,అవుసులపల్లి తండా
పిల్లల చదువుకు కష్టమైతోంది..
తండాలోని పిల్లలు చదువుకోసం మెదక్ వెళ్లాలంటే నానా అవస్థలు పడుతున్నారు. తండా ప్రధాన రహదారికి పక్కనే ఉన్నప్పటికీ ఇక్కడ ఒక్క బస్సు కూడా ఆపరు. తండాలోని పిల్లలు ఆటోల్లో వెళ్లక తప్పడం లేదు.
- నరేష్, అవుసులపల్లి తండా