చేపపిల్లల ఉత్పత్తికి నీటి కొరత
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దిగు వ భాగాన ఉన్న జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుతం సంవత్సరం ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడంతో చేప పిల్లల ఉత్పత్తికి ఆటంకం కలుగుతోంది.జూలై పక్షం రోజులు దాటుతున్నా నీటి కొరతతో చేపపిల్లల ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభం కాలేదు. జిల్లాలోనే స్వయంగా చేపపిల్లలను ఉత్పత్తి చేసే ఏకైక కేంద్రం ఎస్సారెస్పీ జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం. ప్రాజెక్ట్‌లో 1065 అడుగులు నీరున్నప్పుడు చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి నీరందించవచ్చు. ప్రస్తుతం 1063.70 అడుగుల నీరు నిల్వ ఉంది. దీంతో చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి ప్రాజెక్ట్ నీరు అందడంలేదు. చేపప్లిలల సంతనోత్పత్తికి జూలై, ఆగష్టు మాసలే అనువైనవి. జూలై మొదలు నుంచి ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించాలి.
నీటి సరఫరా లేక ఉత్పత్తిప్రక్రియ సకాలంలో సాగడం లేదు. దీంతో మత్స్య కారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సంత్సరం చేప పిల్ల ఉత్పతి పూర్తి స్థాయిలో జరుగుతుందో లేదోనని దిగులు చెందుతున్నారు. జాతీయ చేపపిల్లల ఉత్పత్తి కేంద్రానికి నిరంతరం విద్యుత్తు సరఫరా లేక పోవడం వలన తీవ్ర ఇబ్బందిగా ఉంది. ఉత్పత్తి కేంద్రానికి నీటి సరఫరా చేసేందుకు కేంద్ర వద్ద బావి తవ్వారు. బావి ద్వారా నీటి సరఫరా చేసి చేప పిల్లల ఉత్పత్తి కోసం స్వల్పంగా నీటి సరఫరా చేస్తున్నారు.
అయితే విద్యుత్తు సరఫరా లేక ఆ నీరు కూడా అందడంలేదు. వ్యవసాయానికి సరఫరా చేసే ఆరు గంటల విద్యుత్తు సరఫరా మాత్రమే ఉంది. అదీ లోవోల్టేజీ సమస్యతో మోటారు నడిచేది చాలా తక్కువ సమయం. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి నిరంతరం విద్యుత్తు సరఫరా కోసం ట్రాన్స్‌కోకు డిమాండ్ ప్రకారం రూ. 7 లక్షలు చెల్లించినట్లు మత్స్య శాఖ అధికారులు తెలుపుతున్నారు. జూలై మొదటి వారంలో కరెంటు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు లేదు. దీంతో నీటి కొరత తీవ్రమైంది. అదేవిధంగా అధికారులు స్పందించి బోరుబావి తవ్వించాలని మత్స్య కారులు కోరుతున్నారు. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో మూడు కోట్ల చేప పిల్లల ఉత్పత్తి చేపట్ట వచ్చు.
నీటి కొరత తీవ్రంగా ఉంది
చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. కరెంట్ సరఫరా నిరంతరం లేక పోవడంతో ఉన్న నీటిని సరఫరా చేపట్ట లేక పోతున్నాం. దీంతో ఉత్పత్తి ప్రక్రియ ఆలస్య మవుతోంది. - లక్ష్మీ నారాయణ, ఇన్‌చార్జి, ఎఫ్‌డీవో