
వెండి,బంగారు వస్తువుల తనిఖీ
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో దుర్గమ్మ వెండి, బంగారు వస్తువులను దేవాదాయ శాఖ జ్యూయలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ దుర్గాప్రసాద్ బుధవారం పరిశీలించారు. అమ్మవారికి అలంకరించే వెండి, బంగారు వస్తువులతో పాటు వివిధ సేవల్లో ఉపయోగించే వెండి వస్తువులను రికార్డు ప్రకారం సరిచూశారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి అలంకరించే వస్తువులకు బంగారు తాపడం చేయించిన వాటితో పాటు నిత్యం అలంకరించే వస్తువులను తనిఖీ చేశారు. మల్లేశ్వరాలయం, ఉపాలయాలతో పాటు ఘాట్‌రోడ్డులోని కామధేను అమ్మవారి, వీరాంజనేయస్వామి వారి ఆలయాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. రికార్డు ప్రకారం అన్ని వస్తువులూ వినియోగంలో ఉన్నాయా, లేదా అనే వివరాలను తనిఖీ చేస్తున్నామని దుర్గాప్రసాద్ చెప్పారు.