పాలన గాడిలో పడేనా..?
- నగరపాలిక నూతన కమిషనర్‌కు సమస్యల స్వాగతం
- నేడు పీవీవీఎస్ మూర్తి బాధ్యతల స్వీకరణ
అనంతపురం న్యూసిటీ : వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్న అనంతపురం నగరపాలక సంస్థ అవినీతి, దౌర్జన్యాలు, అడ్డగోలు పనులకు కేరాఫ్‌గా నిలుస్తోంది. వీటికితోడు పాలకవర్గంలోని గ్రూపు రాజకీయాలు అధికారులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక్కడ పని చేయాలంటే వారు హడలిపోతున్నారు. పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి 11 మంది కమిషనర్లు మారారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ నెల 25న మునిసిపల్ ఆర్‌డీ(ఎఫ్‌ఏసీ)గా ఉన్న పీవీవీఎస్ మూర్తిని రెగ్యులర్ కమిషనర్‌గా నియమించింది. ఇక్కడి అడ్డగోలు పనులు, గ్రూపు రాజకీయాల మధ్య ఆయన నగరంలో తిష్ట వేసిన సమస్యలపై ఏ మేరకు చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే!.
- నగరంలో పారిశుద్ధ్యం పడకేసింది. ఏ వీధిలో చూసినా చెత్తకుప్పలు, పందులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. కాలువలు శుభ్రం చేయకపోవడంతో వీధులు కంపు కొడుతున్నాయి. అద్దె ట్రాక్టర్లు ఏర్పాటు చేయకపోవడంతో చెత్త తరలింపునకు మంగళం పాడారు.
- నగరప్రజలకు తాగునీరు అందించండంలోనూ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. నగరంలోని పాతూరు, 5వ రోడ్డు, మారుతీనగర్, హమాలీకాలనీ, హరిజనవాడ, రాణినగర్, నగర శివారు ప్రాంతాలను నీటి సమస్య వెంటాడుతోంది.
- ఇప్పటికే రూ.8 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. అలాగే 172 అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి నివేదిక రానుంది. అధికారులపై వేటుపడే సూచనలూ కనిపిస్తున్నాయి.
- నగరంలో అక్రమ కట్టడాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి పాలకులు, అధికారులు కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
- రెవెన్యూ విభాగంలోనూ టైటిల్ ట్రాన్స్‌ఫర్స్, నెలవారీ జాబితా తదితర వాటిలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. టైటిల్ ట్రాన్స్‌ఫర్ చేయాలన్నా రూ.30 వేల నుంచి రూ.40 వేలు సమర్పించుకోవాల్సి వస్తోందని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల్లో వణుకు
కమిషనర్ పీవీవీఎస్ మూర్తికి విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరుంది. కర్నూలు, నెల్లూరు ప్రాంతాల్లో పని చేసిన అనుభవమూ ఉంది. అందువల్ల అధికారుల గుండెల్లో వణుకు పుడుతోంది. పాలకుల సూచనలతో చేసిన తప్పిదాలకు తమను ఎక్కడ బలి చేస్తారోనని బిక్కుబిక్కుమంటున్నారు.
కమిషనర్‌కు వాహనమేదీ..?
నగరపాలక సంస్థలో అద్దె వాహనాల గడువు ముగియడంతో కాంట్రాక్టర్ వాహనాలను తీసేశారు. కమిషనర్ లేరన్న సాకుతో టెండర్‌ను ఓపెన్ చేయలేదు. కానీ ఇక్కడి గ్రూపు రాజకీయాలతోనే కాంట్రాక్టును ఉన్నఫళంగా రద్దు చేశారనే ఆరోపణలున్నాయి. దీంతో పీవీవీఎస్ మూర్తికి వాహనం సదుపాయం లేకుండా పోయింది. అయితే ఆర్డీగా ఉన్నప్పుడు వాడుకుంటున్న వాహనాన్నే ఉపయోగించుకునే అవకాశం ఉంది.