జిల్లాలో ఈ–గవర్నెన్స్ ప్రాజెక్టు అమలుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సమాచార అధికారి రామ్మోహన్‌రావు తెలిపారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టర్ వాకాటి కరుణ, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు.
-
రాష్ట్ర సమాచార అధికారి రామ్మోహన్‌రావు
-
కలెక్టర్, తహసీల్దార్లతో సమీక్ష
హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఈ–గవర్నెన్స్ ప్రాజెక్టు అమలుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర సమాచార అధికారి రామ్మోహన్‌రావు తెలిపారు. శనివారం జిల్లాకు వచ్చిన ఆయన కలెక్టర్ వాకాటి కరుణ, జేసీ ప్రశాంత్ జీవన్‌పాటిల్‌లను మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా తహసీల్దార్లతో మాట్లాడి, సాంకేతిక వనరుల నిర్వహణలో వారికి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి అప్పటికప్పుడు పరిష్కార మార్గాలను సూచించారు. అనంతరం ఎన్‌ఐసీ సహకారంతో గిరిజన సంక్షేమ శాఖలో విద్యార్థుల హాజరు కోసం అమలు చేస్తున్న బయోమెట్రిక్ విధానాన్ని జులైవాడలోని ఎస్టీ హాస్టల్‌లో పరిశీలించారు. సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత కేయూ వీసీ సాయన్నను కలిసి వెబ్‌సైట్ల నిర్వహణకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై చర్చించారు. ఎన్‌ఐసీ ద్వారా సాంకేతిక సహకారం అందిస్తామని వీసీకి తెలిపారు. ఆయన వెంట టెక్నికల్ డైరెక్టర్ వెంకటసుబ్బారావు, జిల్లా సమాచార అధికారి విజయ్‌కుమార్, అదనపు సమాచార అధికారి అప్పిరెడ్డి పాల్గొన్నారు.