6న ఏపీ ఎంసెట్–2017 నోటిఫికేషన్
ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు వెల్లడి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఎంసెట్ –2017 నోటిఫికేషన్ ఈ నెల 6న విడుదల చేయనున్నట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్‌టీయూలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది మెడిసిన్ ప్రవేశ పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నందున ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, వెటర్నరీ సైన్స్‌లకు మాత్రమే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్ష ఆన్‌లైన్‌లో ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మ««ధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తామని, ప్రతి రోజూ 40 వేల నుంచి 50 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుంటాయని చెప్పారు.ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణకు సీసీఎస్, ఏపీ ఆన్‌లైన్‌లతో ఒప్పందం జరిగినట్టు చెప్పారు. గతంలో రూ.350 ఉన్న పరీక్ష రుసుమును రూ.450కి పెంచినట్లు తెలిపారు. పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున విద్యార్థులకు మాక్, ప్రాక్టీస్ టెస్ట్‌లను అన్ని కళాశాలలూ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోనూ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.