వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యం
-
బీఎస్‌ఎన్‌ఎల్ జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజరు రవిబాబు
ఉదయగిరి: జిల్లాలోని బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ జిల్లా ప్రిన్సిపల్ జనరల్ మేనేజరు రవిబాబు పేర్కొన్నారు. ఉదయగిరి బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం వినియోగదారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి పరిధిలో 9 ఎక్స్ఛేంజ్ కార్యాలయాలతో పాటు 16 టవర్లు ఉన్నాయన్నారు. త్వరలో ఉదయగిరి మండలం దాసరపల్లి, బండగానిపల్లి, వరికుంటపాడు మండలం విరువూరులో టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేటు కంపెనీలకు దీటుగా బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించిందన్నారు. కేవలం రూ.49కే ల్యాండ్‌లైన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. రూ.249, రూ.470, రూ.1149 ప్యాకేజీల్లో బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు అన్‌లిమిటెడ్ డేటా, ఉచిత ఫోన్‌కాల్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ సమస్యలను పీజీఎం దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీజీఎం ప్రభాకర్, కావలి డీఈఈ ఇజ్రాయేలు, సబ్‌డివిజనల్ ఇంజినీరు సురేష్, తదితరులు ఉన్నారు.