నేటి నుంచి ఏక్తాయాత్ర
-
యాత్ర కన్వీనర్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి
నెల్లూరు(బృందావనం) : వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగర పరిధిలో మూడురోజుల పాటు ‘సింహపురి గణేష్ సందర్శన ఏక్‌తా యాత్ర’ నిర్వహిస్తున్నట్లు యాత్ర కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి, కో–కన్వీనర్ సావర్కర్ తెలిపారు. స్థానిక మినీబైపాస్ రోడ్డులోని ఆ సంస్థ కార్యాలయంలో ఆదివారం యాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ యాత్రను బీజేపీ నాయకురాలు పురంధరేశ్వరి స్థానిక పురమందిరం ఎదురుగా ఉన్న శ్రీజ్యోతి వినాయక మందిరం నుంచి ప్రారంభిస్తారన్నారు. వివిధ ప్రాంతాల్లోని 300 గణనాథుల విగ్రహాలను సందర్శించి నిర్వాహకులకు యాత్ర ప్రాధాన్యతను వివరిస్తామన్నారు. ఈ యాత్రలో హిందూదేవాలయ పరిరక్షణ సమితి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, విరువూరు ఆశ్రమ పీఠాధిపతి శ్రీమార్కండేయానంద గిరి స్వామిజీ, నెల్లూరు దత్తాత్రేయ ఆశ్రమ పీఠాధిపతి శ్రీదయానంద గిరి స్వామీజి, మొగళ్లూరు ఆశ్రమ పీఠాధిపతి శ్రీకృష్ణచైతన్యనంద స్వామీజీ, నెల్లూరు రామకృష్ణ ఆశ్రమపీఠాధిపతి శ్రీగోపినాథానంద స్వామిజీ, సంగం శ్రీరాజరాజేశ్వరి జ్ఞానపీఠం పీఠాధిపతి శ్రీరాజరాజేశ్వరానంద స్వామిజీ, ఇనమడుగు వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీహరితీర్ధస్వామీజీ, నరసింహకొండ ఆశ్రమ పీఠాధిపతి మహేష్ అనంతస్వామీజీ, కాశీనాయన ఆశ్రమ పీఠాధిపతి హజరత్‌రెడ్డి తదితరులు పాల్గొంటున్నారన్నారు.