పేదల గుడిసెలు కూల్చడం తగదు
-
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు):
నెల్లూరునగరంలో అక్రమ కట్టడాల పేరుతో పేదల గుడిసెలు కూల్చడం సరికాదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా కాలువ గట్లుపై నివాసాలుంటున్న పేదలను తక్షణమే ఖాళీ చేయాలని లేకుంటే తమ గుడిసెలను కూల్చేస్తామంటూ వారిని ఇబ్బందులకు గురిచేయడం మంచి పద్ధతి కాదన్నారు. వరదలొస్తే ఇబ్బందులు జరగుతాయని పేదల గుడిసెలు తొలగించాలన్న ఆలోచనకు ముందు వాటి నుంచి రక్షించుకునే ప్రయత్నాలు ఎందుకు చేయరని ఆయన ప్రశ్నించారు. నగరంలో ఉన్న పంటకాలువల్లోని పూడికలు తీయడం, జాఫర్‌సాహెబ్, సర్వేపల్లి కాలువల్లోని గుర్రపుడెక్కలను ముందుగానే తొలగించ కుండా నిర్లక్ష్యం చేసి నేడు పేదలపై తమ ప్రతాపం చూపడం ఎంత వరకు సబబు అన్నారు. ప్రత్యామ్నాయం చూపించిన తరువాతనే గుడిసెలను తొలగించాలని సూచించారు. సమావేశంలో ఆపార్టీ నేతలు మద్దు శ్రీనివాసులు, నారాయణ, శ్రీనివాసులురెడ్డి, మాల్యాద్రి, సుధాకర్‌రెడ్డి, రాధాకృష్ణ, భాస్కర్, కప్పిర శ్రీనివాసులు పాల్గొన్నారు.