ఖాకీ వనం విశాఖపట్నం
ప్రత్యేక హోదా గళాలపై పోలీసుల ఉక్కుపాదం
నగరంలో అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం
సాక్షి, విశాఖపట్నం: సుందర విశాఖ నగరం ఖాకీల పదఘట్టనలతో హోరెత్తిపోయింది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అణచివేసేందుకు పోలీసులు గురువారం నగరాన్ని దిగ్బంధించారు. అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తూ సామాన్యులను ఆంక్షలతో భయభ్రాంతులకు గురిచేశారు. నగరంలో అడుగడుగునా కర్ఫ్యూ వాతావరణమే కనిపించింది. ప్రత్యేక హోదా కోసం నినదించిన గళాలను కర్కశంగా అణగదొక్కారు. కనిపించినవారినల్లా అదుపులోకి తీసుకున్నారు. బస్సులు, ఆటోలు, టాక్సీలే కాదు.. వ్యక్తిగత వాహనాల్లో వస్తున్న వారిని సైతం వదిలి పెట్టలేదు. చంటి పిల్లలతో వెళ్తున్న మహిళలను కూడా బలవంతంగా ఈడ్చుకెళ్లారు. స్టేషన్లకు తరలించారు. పర్యాటక ప్రాంతాల్లోనూ ఆంక్షలు విధించారు.
జాతీయ జెండా పట్టుకున్నా నేరమే!
గణతంత్ర దినోత్సవం రోజున యువత జాతీయ జెండాలు పట్టుకొని విశాఖ వీధుల్లో తిరగడమే నేరమైంది. జాతీయ జెండా పట్టుకున్న పాపానికి విద్యార్థులు, యువకులకు పోలీసులు తరిమి కొట్టారు.
సంపూర్ణేష్‌బాబు, తమ్మారెడ్డి అరెస్ట్
ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్, సినీ నటుడు సంపూర్ణేష్‌బాబు, నిర్మాత తిలక్ తదితరులు యువతకు మద్దతు తెలిపేందుకు విశాఖ వచ్చారు. వుడా పార్కు వద్ద తొలుత వీరిని పోలీసులు అడ్డుకోగా.. పార్కు పక్కనే ఉన్న హోటల్‌కు వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు.